English | Telugu
స్థానిక ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పండి... ప్రజలకు చంద్రబాబు పిలుపు...
Updated : Mar 7, 2020
జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తేనే ఉన్నవి ఊడగొట్టారని, ఇక మరోసారి గెలిపిస్తే ఏమీ మిగల్చరని బాబు అన్నారు. వైసీపీ ఉన్మాద చర్యలకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని బాబు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే, కొత్తకొత్త జీవోలు ఇవ్వడమేకాకుండా, మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానంటూ జగన్ బెదిరింపులకు దిగారని చంద్రబాబు విమర్శించారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని, అలాగే, ఫొటోలు, వీడియోలు తీసి పంపాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశామన్న బాబు.... ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపుతూ, అధికారులకు ఫిర్యాదు చేయాలని దిశానిర్దేశం చేశారు.
సీఏఏ అండ్ ఎన్పీఆర్ పై జగన్నాటకాలు ఆడుతున్నారని బాబు విమర్శించారు. ఇక, అశోక్ గజపతిరాజు ఆస్తులపైనా, సింహాచల ఆలయ భూములపై కన్నేసి రాత్రికి రాత్రే రహస్య జీవోలు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతున్న టీడీపీ నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే, వైసీపీ ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా పోరాడుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు అభినందించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై తాడోపేడో తేల్చుకుంటామో తప్ప, భయపడే ప్రసక్తే లేదన్నారు.