English | Telugu

రాహుల్ గాంధీకి కరోనా పరీక్షలు.. సంచలన విషయం బయటపెట్టిన కాంగ్రెస్...

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటూ బీజేపీ మిత్రపక్ష ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ లోక్ సభలో డిమాండ్ చేయడంతో పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినవారిలో ఎక్కువగా సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని, అందువల్ల సోనియా కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిన అవసరముందన్నారు. అయితే, సోనియా కుటుంబ సభ్యులు ఇటీవల ఇటలీ వెళ్లిరావడంతోనే ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ సమర్ధించింది. అయితే, ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో తీవ్ర నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ... ఇవాళ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది.

ఇటీవల ఇటలీ వెళ్లివచ్చిన రాహుల్ గాంధీకి, ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ.... ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. ఫిబ్రవరి 29న విదేశీ పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా రాహుల్ కూడా కరోనా స్క్రీనింగ్ టెస్ట్ లో పాల్గొన్నారని ఏఐసీసీ వెల్లడించింది. తన భద్రతను సైతం పక్కనబెట్టి, సాధారణ ప్రయాణికులతోపాటే అరగంటపాటు క్యూలో నిలబడి కరోనా స్క్రీనింగ్ లో పాల్గొన్నారని తెలిపింది.

అయితే, ఇటలీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 80మంది మరణించగా, వేలాది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు, భారత్ లో నమోదైన కరోనా పాటిజివ్ కేసుల్లో కూడా ఇటలీ నుంచి వచ్చినవాళ్లే ఉండటంతో, రాహుల్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. పైగా రాహుల్ విదేశీ పర్యటనలో కరోనా సోకుండా తగు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే పరీక్షలు చేయించుకోవాలని కోరామని బీజేపీ వ్యాఖ్యానించింది. బీజేపీ డిమాండ్ నేపథ్యంలోనే, రాహుల్ గాంధీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.