English | Telugu

తెలంగాణలో కరోనా పరీక్షల పై కేంద్రం అసంతృప్తి.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్న మంత్రి

తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయని.. కానీ, తెలంగాణలో మాత్రం ఈ విషయంలో అలసత్వం కనిపిస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. కరోనా‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు.

కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి ఈటల అన్నారు.