బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ముంబైలోని బోనీకపూర్ ఇంట్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడు చరణ్ సాహూ కి కరోనా సోకింది. శనివారం సాయంత్రం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతనిని కరోనా పరీక్షల నిమిత్తం పంపించగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ వెల్లడించారు. అయితే.. తనకు గానీ, తన ఇద్దరు కుమార్తెలకు గానీ ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. తన ఇంట్లో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి కూడా లక్షణాలు లేవన్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి తాము బయటకు వెళ్లడం లేదని, ఇంట్లోనే ఉన్నామని చెప్పారు. వైద్యాధికారుల సూచనలను తాము విధిగా పాటిస్తున్నామని, చరణ్ సాహూ సైతం త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని భావిస్తున్నామని బోనీ కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.