English | Telugu
బీజేపీ-శివసేన మధ్య పెరుగుతోన్న దూరం... మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్న కాంగ్రెస్-ఎన్సీపీ
Updated : Oct 30, 2019
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి కొనసాగుతోంది. అధికారం చెరిసగమంటోన్న శివసేన... తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతోంది. బీజేపీతో అమీతుమీకి సిద్ధమైన శివసేన.... 50-50 ఫార్ములాపై వెనక్కి తగ్గేది లేదంటోంది. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చిందని, మాటను నిలబెట్టుకోవాల్సిందేనని తన వాదనలకు మరింత పదునుపెట్టింది. అయితే, మరోసారి సీఎం పీఠాన్ని పంచుకునే ప్రసక్తే లేదంటోన్న బీజేపీ నేతలు... శివసేనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. 50-50 ఫార్ములాకు అసలు ఒప్పందమే జరగలేదంటోన్న బీజేపీ.... శివసేనపై ఎదురుదాడి చేస్తోంది. అంతేకాదు తమతో 45మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు కలకలం రేపారు. అయితే, బీజేపీ నేతల కామెంట్స్‌కు అంతే ఘాటుగా రియాక్టయిన శివసేన.... ఇతర పార్టీలతో కలిసేలా తమతో పాపం చేయించొద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఏదిఏమైనాసరే బీజేపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తేల్చిచెప్పారు. 50-50 ఫార్ములాకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్న ఫడ్నవిస్.... బీజేపీకి 10మంది ఇండిపెండెంట్స్ తోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపికి అనుకూలంగానే ప్రజా తీర్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అయినా, ఎక్కువ సీట్లు సాధించే పార్టీకే సీఎం పదవి దక్కుతుందన్న ఫడ్నవిస్.... వచ్చే ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానంటా వ్యాఖ్యానించారు. ఇక. శివసేన సామ్నా పత్రికలో బీజేపీ వ్యతిరేక కథనాలు రాస్తున్నారని మండిపడ్డ ఫడ్నవిస్.... కాంగ్రెస్, ఎన్సీపీపై కూడా అలా రాయగలరా? ప్రశ్నించారు. ఫడ్నవిస్, ఇతర బీజేపీ నేతల కామెంట్స్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. 50-50 ఫార్ములాకు ఎన్నికలకు ముందే బీజేపీ ఒప్పుకుందని, దాన్ని అమలుచేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతేకాదు హర్యానా తరహా మోడల్ మహారాష్ట్రలో కుదరదని, ఇక్కడెవరూ దుష్యంత్‌లు లేరని శివసేన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
50-50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుందని, ఆ మాట నిలుపుకోవాల్సిందేనని శివసేన అంటుంటే... అసలు తాము అలాంటి ఒప్పందమేమీ చేసుకోలేదంటూ బీజేపీ చెబుతోంది. దాంతో బీజేపీ, శివసేన మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. అయితే, రెండూ పార్టీలూ ఇండిపెండెంట్లకు గాలమేస్తూ బలం పెంచుకునేందుకు పావులు కుదుపుతున్నాయి. ఇక, బీజేపీతో మైత్రికే శివసేన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను మాత్రం తోసిపుచ్చడం లేదు. దాంతో, మహారాష్ట్రలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలను శివసేన పంపుతోంది. అదే సమయంలో, 45మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు బాంబు పేల్చారు. దాంతో, మహారాష్ట్ర సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న కాంగ్రెస్-ఎన్సీపీ... అవసరమైతే శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నాయి.