English | Telugu
సందిగ్ధంలో పడ్డ బీజేపీ.. తదుపరి అడుగులు ఏమిటి?
Updated : Oct 25, 2019
మహారాష్ట్రలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా అధికారం మాత్రం బీజేపీకే దక్కనుంది. అటు హర్యానాలో మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను బిజెపి అందుకోలేకపోయింది. మరాఠా గడ్డపై మళ్లీ కాషాయ ధ్వజం ఎగిరింది. అయితే బీజేపీ రెపరపలు కాస్త తగ్గాయి. అధికారం మరోసారి కమలానికే దక్కనుంది.. కానీ మిత్ర పక్షం శివసేన షరతుల తంతు కలవరపెడుతోంది. బిజెపికి ఇటీవలి కాలంలో తొలిసారి మహారాష్ట్ర రూపంలో కఠినమైన ఎన్నికల పరీక్ష ఎదురైంది. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి శివసేనతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో సులువుగా అధికారంలోకి వస్తామని బిజెపి భావించింది. కానీ మునుపటి బలం కోల్పోయి శివసేనపై పూర్తిగా ఆధారపడి తప్పనిసరైతే ఆ పార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేందుకు అంగీకరించాల్సిన పరిస్థితి ఎదురైంది.
2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. అయినప్పటికీ అప్పట్లో బీజేపీ 122 స్థానాల్లో నెగ్గింది. ఈ సారి 105 స్థానానలకే పరిమితమైంది. శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. గతంతో పోల్చితే ఎన్సీపీ-కాంగ్రెస్ ల కూటమి బాగా పుంజుకున్నప్పటికీ అధికారానికి ఆమడ దూరంలో నిలిచింది. బీజేపీని రెబల్స్ దెబ్బకొట్టగా, ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి ఎంఐఎం పోటీ ఇరకాటంలోకి నెట్టింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, శివసేన కలిసి మ్యాజిక్ మార్కును దాటాయి. అయితే రెండొందలకు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యానికి కూటమి ఆమడ దూరంలో నిలిచింది. శివసేన అనూహ్యంగా తమకు సగం కాలం అధికారం పంచాలనే షరతును బయటకు తీసుకొచ్చింది.
ఇక అటు హర్యానాలో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొంభై సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి డెబ్బై పై చిలుకు స్థానాలు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ఈవీఎంలను లెక్కించే సరికి ఖాతా నలభై దాటలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించలేక చతికల పడిపోయింది. కాంగ్రెస్ అంచనాలను మించి పుంజుకొని 31 సీట్లు సాధించింది. కొత్తపార్టీ జననాయక్ జనతాపార్టీ పది స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఐఎన్ఎల్డీ పార్టీ చీలికలతో కుదేలై చివరకు ఒక్క స్థానానికి పరిమితమైంది. సమాజ్ వాది పార్టీ రెండు స్థానాలను గెలుచుకోగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.
ఓ రకంగా 2018లో కర్ణాటక అసెంబ్లీ తరహా పరిస్థితి ఇప్పుడు హర్యాణలో ఏర్పడింది.మ్యాజిక్ మార్కును చేరుకోలేక పోయినప్పటికీ పరిస్థితి ప్రస్తుతం బీజేపీకే ఎక్కువ అనుకూలంగా ఉంది. బీజేపీకి తగ్గిన సీట్లు ఆరు. విజయం సాధించిన ఏడుగురు స్వతంత్రుల్లో ఐదుగురు బిజెపి రెబల్సే. టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో ఇండిపెండెంట్ లుగా బరిలో దిగారు. వీరందరినీ తమ వైపు తిప్పుకోవడం బీజేపీకీ కష్టమేమీ కాదు. ఖట్టర్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. క్రీడా ప్రముఖుల్లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓడిపోయారు. తొలి సారిగా బరిలో దిగిన ఇరవై తొమ్మిదేళ్ళ బబితా కుమారి కూడా భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ ఒక్కరే గెలుపొందారు. టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ కూడా ఓటమి చెందారు.ఇక బీజేపీ తదుపరి అడుగులు ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.