English | Telugu
జలకళను సంతరించుకున్న డ్యామ్ లు... శ్రీశైలం డ్యాం కొత్త రికార్డు!!
Updated : Oct 25, 2019
భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతా జలమయమవుతోంది. దీనితో నదులు నిండు కుండను తలపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ళతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ ఏడాదిలో ఏడు సార్లు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం విశేషం. ఈ మూడు దశాబ్దాల్లో ఇలా జరగటం ఇదే తొలిసారని అంటున్నారు. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 211.95 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 5.1 లక్షల క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 6.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది, సెప్టెంబర్ తొమ్మిది, పంతొమ్మిది, ఇరవై ఆరు, అక్టోబరు తొమ్మిది, పదమూడు వ తేదీ ఇలా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఒకే ఏడాది ఇన్నిసార్లు క్రస్ట్ గేట్లు ఎత్తిన దాఖలాలు లేవు.
మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు కూడా భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల లోనూ ఇదే పరిస్థితి. దీనితో జూరాల నలభై రెండు గేట్లను ఎత్తారు. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో సాగర్ పధ్ధెనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. వీలైనంత త్వరగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.