English | Telugu

గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బిజెపి పన్నుతున్న అసలు వ్యూహం ఏమిటి?

అంతా మన మంచికే అంటారు కదా అదే తీరుగా మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు బిజెపికి బాగా కలిసి వస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కమలం పార్టీ దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రలు చేపట్టింది. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీని గట్టిగనే టార్గెట్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.గాంధీజీ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను నెరవేర్చలేదంటూ సూటిగా విమర్శిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి మాత్రమే మహాత్మా గాంధీ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని కాబట్టి గాంధీజీ నిజమైన వారసులం తామేనని వారు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దేశంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి పక్కనబెడితే ఆ పార్టీ అధికారంలో లేని రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గాంధీజీ సంకల్ప యాత్ర ఎంతో కొంత పార్టీకి మేలు చేస్తుందన్న మాట వాస్తవం.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఇటీవల గాంధీజీ సంకల్ప యాత్ర దిగ్విజయంగా జరిగింది ఈ యాత్రకి పలువురు జాతీయ స్థాయి నేతలు కదిలొచ్చారు పనిలో పనిగా వివిధ రాజకీయ పక్షాల వారు ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు పార్టీలో జోష్ నింపాయి.సూటిగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు నిస్తేజంలో ఉన్న పార్టీ క్యాడర్ ను ఈ యాత్ర ఉత్తేజపరిచిందనే చెప్పాలి. చిత్తూరు జిల్లాలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించటంతో పాటు సభ్యత్వ నమోదులో మంచి ఫలితాలు రాబట్టడానికి యాత్ర ఉత్ప్రేరకంగా పని చేస్తుందని పరిశీలకులు కూడా అంటున్నారు.ఇటీవల శ్రీకాళహస్తిలో మొదలైన గాంధీజీ సంకల్ప యాత్ర పది రోజుల పాటు కొనసాగి కాణిపాకంలో ముగిసింది. శ్రీకాళహస్తిలో ఈ యాత్రని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. అక్కడ్నించి సత్యవేడు ,నగిరి, చంద్ర గిరి, తిరుపతి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులంతా ఇందులో పాలు పంచుకుంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజక వర్గాల్లో జరిగిన యాత్రకీ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చిత్తూరు పూతలపట్టులో జరిగిన యాత్రకి బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో ఇదివరకెన్నడూ బిజెపి ఈ స్థాయిలో యాత్రను చేపట్ట లేదు అందుకే కావచ్చు ఇందులో భారీ సంఖ్యలో నేతలతో పాటు కార్యకర్తలు, అభిమానులు, విద్యార్ధులు పాల్గొని మద్దతు పలికారు. అనేక చోట్ల ఈ యాత్రని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ముఖ్యనేతలకు ఘనంగా జేజేలు పలికారు.

గాంధీజీ సంకల్ప యాత్రలో బిజెపి నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలైన తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెస్ ల పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. గాంధీజీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు నెట్టుకొచ్చిందని ఇక పై అలాంటి రాజకీయం చెల్లుబాటు కాదని బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైనా కమలం పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు. భవిష్యత్ లో టిడిపి తో పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా దులిపేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి నాలుగైదు నెలలు గడవక ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా వైయస్ జగన్ తన పంథాను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా అనేక రాజకీయ అంశాల పై ప్రసంగాలు చేస్తూ గాంధీజీ సంకల్ప యాత్రని బిజెపి నేతలు కొనసాగించారు, దారిపొడవున దేశ భవిష్యత్తును చక్కదిద్దగలిగేది బిజెపియే అని పదేపదే ప్రకటించారు అందువల్ల ప్రజలంతా తమ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి చిత్తూరు జిల్లాలో బిజెపి చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర సత్ఫలితాలిచ్చింది ,పార్టీ కేడర్ లో ఒక్కసారిగా ఉత్సాహం నిండింది. ఎపిలో అధికార పీఠంపై ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తము తీసిపోమన్నరీతిలో యాత్ర సాగిందని కొందరు చెప్పు కుంటున్నారు ఇన్నాళ్లూ బిజెపిలో చేరడానికి సంశయించిన నేతలు కూడా ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేలా వారికి యాత్ర స్పూర్తి నిచ్చిందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.ఇక ఈ యాత్రతో ఏమి జరగబోతోందో వేచి చూడాలి.