English | Telugu

నెల్లూర్ ని గడగడలాడిస్తున్న 'ఇసుక మాఫియా'

రాష్ట్రంలో వర్షాలు వరదలకు తీవ్రంగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా ఇసుక రీచ్ నుంచి మాత్రం ఇసుక సరఫరా కొనసాగుతుంది. పెన్న రిచ్ లతో పాటు స్వర్ణముఖి రీచ్ ల నుంచి ఇసుక రవాణా జరిగిపోతుంది. అయినప్పటికీ నెల్లూరు జిల్లా వాసులకు ఇసుక మాత్రం అందని ద్రాక్షలా మారింది. ఇందుకు కారణం ఆన్ లైన్ లో జరుగుతున్న తంతే అన్న విమర్శలూ ఉన్నాయి. ఇసుక కావలసిన వారు ఆన్ లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవలసి ఉంది. అయితే ఇందు కోసం ప్రభుత్వం తయారు చేయించిన యాప్ ఉదయం పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది.

అయితే రెండు నిమిషాల్లోపే నో స్టాక్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీంతో ఇసుక కావలసిన వారు ఎన్నిసార్లు మీ సేవ చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. దీని వల్ల నెల్లూరు నగరంలో చాలా వరకు నిర్మాణాలు ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలో నిర్మాణదారులు బ్లాక్ లో ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతం కంటే నాలుగింతలు ఎక్కువ రేటు పెట్టి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. గతంలో ట్రాక్టర్ ఇసుక రెండు వేల రూపాయల ఉండగా ఇప్పుడు ఆరు వేల వరకూ పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇసుక కొరత ప్రభావం ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలో కనిపిస్తోంది. ఎక్కువ నిర్మాణాలు ఈ ప్రాంతం లోనే జరుగుతున్నాయి. దీనికి తోడు భవన నిర్మాణ కూలీలు కూడా ఈ ప్రాంతం లోనే నివాసముంటున్నారు.

ఈ ప్రభావం వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కనిపించే అవకాశముందని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి. దీంతో ఇసుక కొరత పై ప్రతిపక్షాల ఆందోళన రోజే ఈయన కూడా గళం విప్పారు. నెల్లూరు నగరం వరకు పొట్టేపాళెం రీచ్ నుంచి ఇసుకను ట్రాక్టర్ ల ద్వారా తరలించటానికి అనుమతులు ఇప్పించుకున్నప్పటికీ అది కూడా పక్కదారి పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆన్ లైన్ లో ఇతర జిల్లాల వారికి ఎక్కువగా పర్మిట్ లు రావడం వెనుక ఇసుక మాఫియా పని చేస్తుందని దీనిపై అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని అధికార పక్ష ఎమ్మెల్యే హెచ్చరించారు.మొత్తం మీద ఎమ్మెల్యే ప్రకటన తర్వాత అధికారుల్లో చలనం వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఇందు కోసం జిల్లా కలెక్టర్ ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించారు . దీంతో ఆమె ఆధ్వర్యంలో మైనింగ్ శాఖతో పలుమార్లు చర్చలు జరిపారు. పోలీసులు, రెవిన్యూ, మైనింగ్, విజిలెన్స్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా ఇసుక తరలింపు అడ్డుకోవడానికి శాశ్వత చెక్ పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా పది వరకు చెక్ పోస్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అసలు ఇసుక పర్మిట్లు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకోలేని వారి సమస్య గురించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగాలి అని అంటున్నారు.

ఇసుక అందరికీ అందాలంటే ముందు యాప్ ద్వారా ఇసుక కొనుగోలు సరళతరం చేయాలని ఏ ఏ ప్రాంతం వారు ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసే విధంగా నీమా మార్చితే తప్ప సమస్య పరిష్కారం కాదని అంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కొరతపై రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యాఖ్యలు యంత్రాంగంలో ఒక్కసారిగా సంచలనంగా మారాయి.