English | Telugu

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. పాత ధరలు, కొత్త నిబంధనలు

ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. విశాఖ, విజయవాడలో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు. అంతరాష్ట్ర సర్వీసులు నడపాలని భావించి, ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి వచ్చాక అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దూర ప్రాంతాలకు నైట్ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. కానీ, బస్ స్టాండ్‌కి రాత్రి 7 లోపు చేరుకోవాలని సూచించారు.

భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామని.. అలాగే బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ఆదేశించారు. బస్ స్టాండ్‌లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతి బస్ స్టాండ్‌లో శానీటైజర్ సదుపాయాన్ని కల్పించామని.. బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. టిక్కెట్ల విషయంలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌కు రిజర్వేషన్ ఫీజు ఉండదని చెప్పారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీలో కొన్నాళ్లపాటు ఆన్ బోర్డ్ కండక్టర్లు ఉండరని తెలిపారు. అలాగే, బస్సు ఛార్జీలను పెంచట్లేదు అని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.