English | Telugu

దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడంలో ఏపీ ఐదో స్థానంలో ఉంది

* పీపీఈ లు 1.35 లక్షలు, N 95 మాస్కులు 1.16 లక్షలు ఉన్నాయి
* ఏపీ లో ప్రతి మిలియన్‌కు 331 మందికి పరీక్షలు చేస్తున్నాం
* శాంపిల్‌ రిజల్ట్‌ కోసం మంచి సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం

కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడంలో ఏపీ ఐదో స్థానంలో ఉందని ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి జవహర్‌ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్-19 పరీక్షల వివరాలను తెలియజేశారు. దేశవ్యాప్తంగా 2,74,599 పరీక్షలు చేశారు. భారతదేశ జనాభాతో పోల్చుకుని లెక్క వేసుకుంటే.. ప్రతి మిలియన్‌కు (10 లక్షలకు) 198 పరీక్షలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి మిలియన్‌ కు 198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీ లో ప్రతి మిలియన్‌కు 331 మందికి పరీక్షలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉందని జవహర్‌ రెడ్డి తెలిపారు.

"ఈ నెల 7వతేదీ నాటికి రాష్ట్రంలో 4 ల్యాబోరేటరీలున్నాయి. ఈ రోజు 7 ల్యాబోరేటరీలు 24 గంటలూ పని చేస్తున్నాయి. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజ్, కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కొన్ని సివిల్‌ వర్కులు జరుగుతున్నాయి. రెండు ల్యాబ్‌లకూ సరిపడిన ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉంది. తిరుపతి ల్యాబ్‌ శుక్రవారం (ఏప్రిల్ 17) నుంచి అందుబాటులోకి వస్తుంది. కర్నూలు ల్యాబ్‌ పూర్తిస్థాయిలో సిద్ధమవడానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది." అని జవహర్‌ రెడ్డి వెల్లడించారు.

"గత మూడు రోజులుగా ప్రతి రోజూ 2 వేల శాంపిల్స్‌ పరీక్షిస్తున్నాం. 3వేల శాంపిల్స్‌ పరీక్షలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రూనాట్‌ కిట్స్‌తో పరీక్షలు చేద్దామని అనుకున్నాం. కానీ కిట్ల లభ్యత అనుకున్న స్థాయిలో లేదు. వాటిని ఎక్కడా తయారు చేయడం లేదు. కొన్ని రోజుల క్రితం 2 వేల కిట్లు వచ్చాయి. వాటితో పరీక్షలు నిర్వహించాం. ఏప్రిల్ 16 గురువారం సుమారు 18వేల కిట్లు వచ్చాయి. పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 225 మెషీన్లు ఉన్నాయి. 13 జిల్లాలో 49 సెంటర్లలో ఈ 225 మెషీన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే రోజుకు 4 వేల పరీక్షలు చేయవచ్చు.కిట్ల లభ్యత లేకపోవడం వల్ల పరీక్షలు ఎక్కువ మొత్తంలో చేయలేకపోతున్నాం.1 లక్ష కిట్లకు ఆర్డరు పెట్టాం. సరఫరా నిదానంగా ఉంది. దేశంలో ట్రూనాట్‌ కిట్లు ఉపయోగించేది మూడు నాలుగు రాష్ట్రాలే. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటి" అని పేర్కొన్నారు.

"ప్రతి రోజూ వేల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నాం కాబట్టి.. రిపోర్టులు పేపర్లలో తెప్పించుకోడానికి కుదరదు. దీని కోసం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం. శాంపిల్‌ ట్రాకింగ్, శాంపిల్‌ కలెక్షన్, శాంపిల్‌ రిజల్ట్‌ కోసం మంచి సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం. దాని ద్వారా పని సులభం అవుతోంది. రిపోర్టులు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. 90 నుంచి 95 శాతం రిపోర్టులు ఆన్‌లైన్‌లోనే కనబడుతున్నాయి. శాంపిల్‌ కలెక్షన్‌ నుంచి రిజల్ట్‌ వరకు అన్నీ ఆన్‌లోన్‌లో చూసుకోవచ్చు. ప్రతి జిల్లాలో ఒక కోవిడ్‌ ఆసుపత్రిని పెట్టాం. ఇవి ఇప్పటికే పని చేస్తున్నాయి. పీపీఈ లు 1.35 లక్షలు, N 95 మాస్కులు 1.16 లక్షలు ఉన్నాయి. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ పుష్కలంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." అని జవహర్‌ రెడ్డి తెలిపారు.