English | Telugu

నర్సీపట్నం డాక్టర్‌ ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్!

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి డాక్టర్ కె. సుధాకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద సుధాకర్‌పై కేసులు నమోదు చేసినట్టు నర్సీపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు.

ఏపీ ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాస్కులు మరియు కనీస రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యం చేయాలంటూ డాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీశాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యల ప్రతిపక్ష టీడీపీ ఉందని అధికార పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.