English | Telugu

రాజధాని తరలింపు ప్రక్రియ జోరందుకుందా?

వాస్తవానికి ఉగాదినాడే విశాఖ‌ నుంచి పాలనకు శ్రీకారం చుట్టాలని ముఖ్య‌మంత్రి భావించారు. కానీ హైకోర్టు అభ్యంతరాలు, కరోనా పరిస్థితులతో అది నిలిచిపోయింది. అయినప్పటికీ రాజధాని విషయంలో పట్టుదలతోనే వుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఎలాగైనా విశాఖకు రాజధాని తరలించాలనే ధ్యేయంతో ఉంది. ఇందుకు సంబంధించి మే 28వ తేదీ ఉదయం 8గంటలకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది.అయితే ముందుగా భావించినట్టు సచివాలయం మిలీనియం టవర్స్ లో కాకుండా వేరేచోటకు తరలించనున్నారు. 20 లారీలలో ఫర్నిచర్ తరలిస్తున్నారు. సచివాలయం గ్రేహౌండ్ కంపౌండ్ లోని ఇండియా బుల్స్ -విజ్ఞాన్ సమీపంలో ఉండనుందని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

గుట్టుగా పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.
ఉద్యోగులను బదిలీ చేయకుండా ఆన్ డ్యూటీపై విశాఖ నుంచి పనిచేయించాలని భావిస్తున్నార‌ట‌. అయితే, ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు మెదపడంలేదు. అందరూ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అని సైలెంటుగా ఉంటున్నారు.

ప్రభుత్వం ఆన్ డ్యూటీ ఇచ్చి మరీ కొందరు కీలక శాఖల ఉద్యోగులను విశాఖ పంపాలని పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగసంఘాలకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై వారు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆన్ డ్యూటీపై ఉద్యోగులను పంపితే న్యాయపరమయిన చిక్కులు ఉండవంటున్నారు అధికారులు. ఆన్ డ్యూటీపై పంపొద్దని చెప్పడానికి నిబంధనలు ఏవీ లేవని, ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖకు సచివాలయం తరలింపు విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.