English | Telugu
నలుగురికీ నచ్చిందీ నాకసలే నచ్చదులే...
Updated : Apr 14, 2020
ఇంతకు ముందు ఘటనలను పక్కనపెడితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ తొలగింపు.. కొత్త కమిషనర్ నియామకం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రభుత్వం రాత్రికి రాత్రి అనేకన్నా కేవలం గంటల వ్యవధిలో ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం వివాదాలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తుల నుండి సామాన్య పౌరుల వరకు ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
ఎస్ఈసీ తొలగింపు చెల్లదంటూ యోగేష్ అనే లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయగా శుక్రవారం స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కామినేని శ్రీనివాస్, బీజేపీ తరపున పిటిషన్స్ దాఖలు చేయగా టీడీపీ నేత వర్ల రామయ్య కూడా ఇదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. మరో సామాన్య పౌరుడు కూడా ఇంకో పిటిషన్ దాఖలు చేశారు.
వీటన్నిటినీ కలిపి హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించగా ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేసేందుకు నెల రోజుల సమయం కావాలని కోరారు. అయితే, బీజేపీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కేసు తీవ్రతను.. మాజీ మంత్రులు స్వయంగా పిటిషన్లు దాఖలు చేయడంను కోర్టుకు గుర్తుచేయడంతో హై కోర్టు ప్రభుత్వానికి కేవలం మూడే రోజుల సమయం ఇచ్చింది.
దాఖలైన అన్ని పిటిషన్లు ప్రభుత్వానికి అందించి మూడు రోజులలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఒకపక్క రాష్ట్రంలో కరోనా ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుండగా ఉపాధి కోల్పోయిన ఎందరో ప్రభుత్వం వంక ఆశగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎస్ఈసీ తొలగింపుతో రాజకీయ చిచ్చురేపి వినోదం చూస్తోంది.
ఒకవైపు కరోనా విలయం.. మరోవైపు ఎస్ఈసీ తొలగింపుపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నా రాష్ట్రంలో ఎన్నికలకు మాత్రం రంగం సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమించిన గంటలలోనే.. లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి కొత్త వ్యక్తులకు అనుమతి లేదన్న నిబంధనకు నీళ్ళొదిలేసి విధులలో ప్రత్యక్షమైన కనగరాజన్ సోమవారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించిన కనగరాజన్ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల వాయిదా.. ప్రస్తుత లాక్ డౌన్ తదితర పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని అందుకు తగిన కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. అయితే.. ఒకపక్క రాష్ట్రంలో కరోనా కష్టాలు వెంటాడుతుండగా.. మరోవైపు తన నియామకంపైనే హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే రాష్ట్రంలో ఎన్నికలపై సమీక్ష చేయడం.. ప్రభుత్వం పనితీరు.. ఎన్నికలపై ఉన్న వ్యామోహమే తప్ప ప్రజా శ్రేయస్సు ఎక్కడా కనిపించనట్లుగా ఉందని విమర్శలొస్తున్నాయి.
మరో వైపు నేడు ప్రధాని మే 3 తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రకటన చెయ్యడం, 20 తేదీన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు విషయంలో హైకోర్టు తీర్పు రానుండడంతో ఏం జరగనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.