English | Telugu

ఎవ‌రు ఎలాంటి మాస్కులు ధ‌రించాలి?

జలుబు, దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి సర్జికల్‌ మాస్కులు అవసరం. అలాగే రోగులకు సేవలు చేసేవారు కూడా సర్జికల్‌ మాస్కులే వాడాలి. అందుబాటులో ఉంటే ఎన్‌-95 మాస్కులు ధరిస్తే ఇంకా మంచిది.

కొవిడ్‌-19కు చికిత్స చేసేవారికి: కరోనా ఇన్‌ఫెక్షన్‌ బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బంది విధిగా ఎన్‌-95 మాస్కులు ధరించాలి. సీపీఆర్‌, వెంటిలేషన్‌, బ్రాంకోస్కోపీ, శ్వాసనాళంలోకి గొట్టాన్ని పంపించే చికిత్సల వంటివి చేసే గదుల్లో ఉండేవారికీ ఇవి అవసరమే. మరణించినవారిని తరలించేవారు ఎన్‌-95 మాస్కులతో పాటు శరీరాన్ని కప్పి ఉంచే రక్షణ పరికరాలు కూడా ధరించాలి.

అయితే మాస్కు ధరించటానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ను చేతులకు రాసుకోవాలి. నోరు, ముక్కు ఏమాత్రం కనిపించకుండా మాస్కు ధరించాలి. ముఖానికి, మాస్కుకు మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్కు తడిగా అయితే వెంటనే తీసేసి కొత్తది పెట్టుకోవాలి. ఒక మాస్కును ఒకసారే వాడాలి.

మాస్కు పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని చేతులతో తాకరాదు. ఒకవేళ తాకితే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

మాస్కును తీసేటప్పుడు చెవుల చుట్టూ ఉండే పట్టీలను పట్టుకునే తీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని తాకరాదు. తీసిన మాస్కును సంచీలో పెట్టి బిగించి చెత్త బుట్టలో వేయాలి. లేదంటే మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి. మాస్కును తీసిన తర్వాత చేతులను సబ్బుతో రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీలుంటే శానిటైజర్‌ రాసుకోవచ్ఛు.

ఎత్తయిన భవనాల్లో లిఫ్ట్‌లు, మెట్ల వంటి చోట్ల వైరస్‌ అంటుకొని ఉండొచ్ఛు కాబట్టి అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ఇంట్లోనే మాస్కును పెట్టుకొని బయటకు రావాలి. ఇంట్లోకి వచ్చాకే తీసెయ్యాలి. గుడ్డ మాస్కులను రోజూ శుభ్రంగా ఉతికి, ఆరెయ్యాలి.