English | Telugu

జగన్ సర్కార్ షాక్.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ రాదు

పట్టణాల్లో పేదలకు కట్టించే ఇళ్లు నామమాత్రంగా కాకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పట్టణ పేదలకు గూడు సైజు సౌకర్యాల గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలకు.. తాజాగా ఇంటి స్థలంతో ముడిపెట్టి సామాజిక పింఛన్ లకు నిర్ణయించిన అర్హతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు.. పేద దంపతులు పట్టణంలో తమకు సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం మూడు సెంట్లు కావాలి. 750 చదరపు అడుగులు ఉంటే తాజా అర్హత నిబంధనల ప్రకారం వారు పేదలు కాదు. కాబట్టి వారికి పింఛను అందదు. అలాగే కొద్ది జీతాలకు పని చేసే అంగన వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వీఏవోలు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబాల్లో పింఛనుకు అర్హులు ఉన్నా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఇక పై అనర్హుల కింద లెక్కే అని తేల్చేసింది ప్రభుత్వం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్ల సైజును పెంచటమే కాక అర్హత నిబంధనలను భారీగానే సడలించింది. ఇంత చేసి ఈ విధంగా అర్హతలను నిర్ణయించి అనర్హులు మిగిలే ఉన్నారన్న ఆలోచన ప్రభుత్వంలో మొదలైంది. అటువంటి వారిని ఏరి వేసే పనిచేపట్టింది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 54 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. అందులో 5 లక్షల దాకా ఏరివేతకు గురవుతాయని భావిస్తున్నారు. అందుకోసం పెట్టిన కొన్ని నిబంధనలు పేదవర్గాల్లో చిన్న ఉద్యోగి శ్రేణుల్లోనూ భయాందోళనను పెంచుతున్నాయి.

రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంగన వాడీ కార్యకర్తలు చెరో లక్ష మంది ఉండగా.. వీఐవోలు ఆశాలు కలిపి 60,000 వేల మంది దాకా ఉంటారు. ఏరివేత మొదలైతే తక్షణం దెబ్బ వీరిపైనే పడనుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ రూ.2000 నుంచి రూ.2,250 ఇస్తూ నాలుగేళ్ళలో రూ.3000 వరకు పెంచుతామని ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. పెన్షన్ లు 250 కలిపి ఇవ్వడం మాత్రమే అమలు చేసిన ప్రభుత్వం అదే ఉత్తర్వుల్లో 60 ఏళ్ల వయస్సున్న వారికి ఇస్తామన్న ఆదేశాలను అమలులోకి తీసుకురాలేదు. పాదయాత్రలో.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పింఛన్ల పై ఇచ్చిన హామీల మేరకు కొత్తగా సుమారు పది లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ నెల ( డిసెంబర్ ) 13న విడుదలైన పింఛన్ ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు కొత్త వారిని ఉద్దేశించి జారీ చేసినట్టు అధికారులు ప్రకటించారు. అదే నిజమైతే ఇబ్బంది లేదు కానీ కొత్త వారికి ఇవ్వడానికి ఇప్పటికే అందుకుంటున్న వారికి వాతపెడతారని.. పింఛన్ లను అమలుపై జగన్ మార్పు కోసమే ఇదంతా చేస్తున్నారన్న ప్రచారం సర్వత్రా బలపడుతుంది. అధికారులు ఎందుకు తమ సంతకాలు తీసుకుంటున్నారో తెలియక ఇక పై పింఛన్ రాదేమోననే భయంతో అక్కడక్కడా సిబ్బందిని పెన్షన్ దారులు నిలదీస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శు లతో గొడవకు దిగుతున్నారు.