English | Telugu
యాదాద్రికి వెళ్లిన కేసీఆర్.. 100 ఎకరాల స్థలంలో యాగనిర్వహణ!!
Updated : Dec 18, 2019
ముఖ్య మంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. కొండపై ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపం, అంతర ప్రాకార మండపం, రామానుజ కూటం, యాగశాల, నిత్య కల్యాణ మండపం అద్దాల మండపంతోపాటు, సప్తగోపురాలు, ఆలయ ప్రధాన మండపం, ముఖమండపం, ఉపాలయాలు, అపురూప ఆధ్యాత్మిక మూర్తుల శిల్పాలను సీఎం పరిశీలించారు. 2 గంటల పాటు ప్రధాన ఆలయ మండపంలో కలియతిరిగిన కేసీఆర్ రాతిశిలా నిర్మాణ పనులను అద్భుతంగా చేశారని కొనియాడారు. పనులు ఆధ్యాత్మికత ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి వారు స్వయంభువుగా వెలసిన గర్భాలయాన్ని కేసీఆర్ సందర్శించారు.ఆలయ ప్రధానార్చకులు అనువంశిక ధర్మకర్త ఆలయ ఈవోతో కలిసి స్వయంభూమూర్తులను పరిశీలించారు. ఆ తర్వాత ప్రధాన ఆలయం ముఖమండపం తదితరాల్లో కూడా పరిశీలించారు. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం ఏమాత్రం దెబ్బతినకూడదని ఎక్కడ ఏ మాత్రం తొందరపాటు వద్దని కేసీఆర్ తెలియజేశారు. ప్రతి నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరగాల్సిందే నని స్తపతులు అధికారులకు స్పష్టం చేశారు. యాదాద్రి నర్సిపూడి ఆలయం సనాతమైనదని ఇక్కడ పూజలు చాలామందికీ వారసత్వంగా వస్తున్న సంప్రదాయమని గుర్తు చేశారు.దేశ విదేశాల్లో లక్ష్మీనరసింహుడికి భక్తులు ఉన్నారని రాబోయే కాలంలో లక్షల మంది వస్తారని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు.తద్వారా గర్భాలయంలో మూలవిరాట్టును ముట్టుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది.
లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయాన్ని సందర్శించేలా సంపూర్ణంగా పనులు పూర్తి చేసి చెబితే చినజీయర్ స్వామితో కలిసి మరోసారి వచ్చి అన్ని పనులు పరిశీలించి ఆలయ ఉద్ఘాటన సుదర్శన మహాయాగం నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పచ్చదనం కోసం ఉద్యానవనాలను పెంచాలనే ప్రాంగణంలో లక్ష్మీనరసింహుల ప్రాశస్త్యం చాటేలా నృసింహ చరితం, స్థలపురాణం, తైలవర్ణ చిత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు వసతి తలనీలాలు పుణ్య స్నానాల విషయంలో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. క్యూలైన్ల నిర్మాణం, పుష్కరిణి ప్రసాదాల తయారీ కాంప్లెక్స్ తదితరాల పరిశీలించి సూచనలు చేశారు.కొండ పై శివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ ఆలయ వైశాల్యాన్ని అడిగి తెలుసుకుని కొలతలు వేయించారు.శివాలయం ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహమూర్తి తో అక్కడ జరిగే పూజలు కావలసిన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అర్చకుల నియామకాలు జరపాలని ఈవోకు సూచించారు.కొండ కింద గండి చెరువు వద్ద దాదాపు 100 ఎకరాల స్థలంలో యాగనిర్వహణకు అనుకూలతల పై అధికారులతో చర్చించారు. సందర్శకులకు సౌకర్యాలు వాహనాల పార్కింగ్ పై సూచనలు చేశారు. రాష్ట్రపతి ప్రధాన మంత్రి వంటి ప్రముఖులు ఆలయ సందర్శనకు వచ్చినపుడు వారికి సకల సౌకర్యాలతో ప్రెసిడెన్షియల్ సూట్లు ఉండాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు 15 సూట్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.