English | Telugu

ప్రజలను ఆకట్టుకున్న పోలీస్ పరేడ్ స్క్వాడ్ టీం కార్యక్రమాలు...

ఉగ్రవాదులను అరికట్టేందుకు అత్యంత కీలకమైన సమయాల్లో ప్రజలను కాపాడేందుకు స్పెషల్ ఆయుధాలను మరియు స్క్వాడ్ టీమ్ ను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి సారిగా ప్రకాశం జిల్లా ల్లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో చండీఘర్, పంజాబ్, బెంగళూరు, ఢిల్లీల్లో మాత్రమే ఈ స్క్వాడ్ టీంలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు ప్రజలకూ తలపెట్టే ముప్పు నుంచి క్షేమంగా వారిని రక్షించేందుకు స్క్వాడ్ టీమ్ ఉపయోగపడుతుంది. జిల్లాలో ఇరవై ఐదు మంది యువ పోలీసులను ఎంపిక చేసి ఎస్పీ సిద్ధార్థ కౌషల్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వీరు ఉగ్రవాదుల దాడులను అరికట్టడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు ఈ బృందం ప్రత్యేకంగా పనిచేస్తుంది.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి సారి ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్ లో ప్రత్యేక రక్షణ దళం స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ టీమ్ కు ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు ఇరుకు సందుల్లో ప్రత్యర్థులపై ప్రతిఘటించటం, బాంబుల దాడుల నుంచి ప్రజలను కాపాడటం వంటి అంశాల పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.అంతేకాకుండా ఉగ్రవాదులు ప్రజలపై బాంబు దాడులు చేసే సమయంలో వారిని రక్షించి సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడం ఎలా అదే సమయంలో ఉగ్రవాదుల పై దాడులు చేసి విజయం సాధించేందుకు అధునాతన ఆయుధాలు వినియోగంలో వీరికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్క్వాడ్ టీమ్ ను ప్రారంభించారు .అనంతరం స్క్వాడ్ టీమ్ నిర్వహించే ప్రదర్శనను తిలకించారు. ఈ ప్రదర్శనలో ముఖ్య అతిథిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి పాడుబడిన బిల్డింగ్ లో ఉంచుతారు,స్క్వాడ్ టీమ్ ముఖ్య అతిథిని కాపాడి ఉగ్రవాదులను అంతమొందించే ఘట్టం అద్భుతంగా ప్రదర్శించారు. అదే విధంగా కొంత మంది దుండగులు బస్సును హైజాక్ చేసి ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా స్క్వాడ్ బృందం కాపాడటం వంటి ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన కోసం నెల రోజులుగా ఎస్పీ సిద్ధార్థ కౌషల్ స్క్వాడ్ టీమ్ చేత కసరత్తు చేస్తూ వారికి సలహాలు సూచనలుతో చేశారు. మొత్తం ఈ ప్రదర్శనలో స్క్వాడ్ టీమ్ తో పాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులు పాల్గొన్నారు. ఈ స్క్వాడ్ టీమ్ ప్రారంభ కార్యక్రమాన్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రజలు తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు.