English | Telugu

ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం!

తెలంగాణ నుంచి కూడా ధాన్యం రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం. మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నాని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయా? లేవా? అన్నది చూసుకోండి. ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం. ఈ సమయంలో వ్యవసాయం అన్నదాన్ని మనం కాపాడుకోగలిగితే, రైతు అనేవాడిని మనం ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం ముఖ్య‌మంత్రి అన్నారు.

గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి. రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్నదానిపై కలెక్టర్లకు సమాచారం రావాలి. దీని ఆధారంగా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాలి. మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదు. రవాణాకూడా జరగడంలేదు. మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదు. ఈ సమస్యల పరిష్కారానికి క‌లెక్ట‌ర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి సూచించారు.

వైయస్సార్‌ జనతా బజార్లకు బీజం వేస్తున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్నా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి అన్నారు. రైతులు అవస్తలు పడకుండా చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించేలా వారిలో చైతన్యంకలిగించి... ఆమేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి కరోనా నివారణా చర్యలు పాటిస్తూ.. కార్యకలాపాలు ఎలా చేపట్టాలన్నదానిపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించాలని సి.ఎం. సూచించారు.

గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి. నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని సి.ఎం. ఆదేశించారు. ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైల్లో పెట్టాలి. కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా కంట్రోల్‌లో ఉండాలి.