English | Telugu
ముఖ్యమంత్రికి అండగా నిలుద్దాం..ఒక్క పత్రికలోనే ప్రకటనలు
Updated : Apr 13, 2020
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్లు పేజీ యాడ్లు వచ్చేస్తుంటే దాని స్టామినా పెరగక తగ్గుతుందా? కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే ఆ పత్రిక మాత్రం ప్రకటనల పండగ జరుపుకుంటున్నది. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అంటూ ఇప్పటికే నాలుగు ఫుల్ పేజీ యాడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో యాడ్ ఖరీదు అక్షరాలా కోటీ 36 లక్షల రూపాయలు. ముఖ్యమంత్రి ఫొటో ప్రముఖంగా సంబంధిత శాఖ మంత్రి ఫొటో కింద వచ్చే ఈ ప్రకటనలో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రికి అండగా ఉండటం ఏమిటో అర్ధం కాదు కానీ మరెన్నో యాడ్లు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది.
ఏ శాఖలో డబ్బులు ఉంటే ఆ శాఖ లోని ఆ విభాగానికి ఆ పత్రిక బిల్లు పంపుతుంది. దాన్ని అక్కడ నుంచి చెల్లించే ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనా పై జరుపుతున్న పోరాటానికి ఇన్ చార్జి అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ పర్యవేక్షించే ఆళ్ల నాని ఫొటో మాత్రం ఉండదు. ఎవరి ఫోటో ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చేది మన పత్రికకే కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలకు పైబడి ఆ పత్రిక ఖజానాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటన ఇస్తే డబ్బులు వచ్చేసినట్లే కదా.
8వ తేదీన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో యాడ్ వచ్చింది. రేపో ఎల్లుండో కోటీ 36 లక్షల రూపాయలు చెల్లించేస్తారు. పాపం ఆ శాఖకు చెందిన కొన్ని విభాగాల్లో పని చేసే వారికి రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. పని చేసేవారికి జీతాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు కానీ పత్రికలకు మాత్రం యాడ్లు వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అని లలితా జువెలర్స్ వారు మొదట సదరు పత్రికకు ప్రకటన ఇచ్చారు. డబ్బులు ఊరికే రావు అన్న గుండు బాస్ కాన్సెప్టు బాగుందని అన్ని ప్రభుత్వ శాఖలూ ముఖ్యమంత్రికి అండగా నిలవడానికి పాపం ఆ పత్రికకు ప్రకటనలు ఇవ్వడానికి క్యూ కట్టేశాయి. అసలు కరోనా బారిన పడ్డవారికి అండగా నిలవాలి లేదా దాని బారిన పడకుండా ప్రజలకు అండగా నిలవాలి కానీ ముఖ్యమంత్రికి అండగా దేనికి? కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు గుప్పిస్తే అండగా ఉన్నట్టు ఎలా అవుతుంది? ఈ ప్రకటనలకయ్యే ఖర్చు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చినా కొంత మేలు జరుగుతుంది కదా అంటున్నారు ప్రజలు.
ఇప్పుడు ఈ వార్త చూసిన వైసీపీ అభిమానులు ఏమంటారో తెలుసా? చంద్రబాబునాయుడు అయన అనుకూల మీడియాకు వందల కోట్లు దోచి పెట్టినప్పుడు కనిపించలేదా? మీరు కూడా అయన భజన మీడియా లాగా వార్తలు రాస్తున్నారు అని విమర్శలకు దిగే ప్రమాదం కూడా లేకపోలేదు.. దిగుతారు కూడా. వాటి పర్యవసానమే చంద్రబాబుకు 23 సీట్లు. మరి మనకూ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లే కావాలా? అన్నియ్యా..