English | Telugu

సీఎస్ విషయంలో జగన్ కీలక నిర్ణయం.. కేంద్రానికి లేఖ!

జూన్ నెలాఖరుతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. సీఎస్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని జగన్ కేంద్రాన్ని కోరారు. సీఎస్ గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించి 6 నెలలే కావడంతో పదవీకాలాన్ని పొడిగించాలని కోరారు. అదీగాక, ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో పరిపాలనకు కేంద్రబిందువైన సీఎస్ మార్పు పై జగన్ విముఖంగా ఉన్నట్లు సమాచారం.

కరోనా విపత్తు నేపథ్యంలో పదవి విరమణ చేసే అధికారులకు పలువురికి 3 నెలల వరకు పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. అదే విధంగా నీలం సాహ్ని పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా సీఎస్ పదవీకాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని 3 నెలల పాటు పొడిగించింది. అలాగే, 2014లో రాష్ట్ర విభజన సమయంలో పీకే మహంతీ పదవీకాలాన్ని 4 నెలల పాటు పొడిగించింది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాగే సీఎస్ పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.