English | Telugu

జగన్ దూకుడు.. దిశ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి

దిశ చట్టాన్ని ఇటీవలే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇది చట్టంగా మారింది. కాగా, దిశ చట్టం అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హాజరయ్యారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

చట్టం చేసి వదిలేస్తే దానిపై విమర్శలు వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం అమలుకావాలని, అమలు కావడం లేదన్న మాట ఎక్కడా రాకూడదని సీఎం అధికారులను కోరారు. దిశ చట్టం అమలుకు కావల్సిన పకడ్బందీ చర్యలన్నీ తీసుకోవాలని ఆదేశించారు. దిశ చట్టం అమలు చేయాలంటే పటిష్టమైన వ్యవస్థ అవసరం అని, దీనికోసం 13 కోర్టులు పనిచేస్తున్నాయని, వీటికి నిధులు అవసరం అవుతాయని అధికారులు చెప్పడంతో.. నిధులను తక్షణమే విడుదల చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్కో కోర్టుకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశారు. అలానే తిరుపతి, విశాఖలో ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి అవసరమైన సిబ్బంది కోసం జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు దిశ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగంలో ఓ ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.