నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు. రమేష్ కుమార్ తన కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా నిలువరించేందుకు పోలీసు బలగాలను మోహరించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో రాష్ట్ర అధిపతిగా మీరు జోక్యం చేసుకుని విషయాలను సరిదిద్దాలని కోరుతున్నామన్నారు. రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కన్నా కోరారు.
స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న తీరు సరి కాదని కన్నా లేఖలో పేర్కొన్నారు. అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక ఎన్నికలలో అక్రమాలకు తెగబడిందన్నారు. పలువురు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తే.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా పోస్టింగుల్లో ఉంచిందన్నారు.