English | Telugu

పెను తుఫాన్ గా మారిన ఆంఫన్

ఆంధ్రప్రదేశ్ కు ఆంఫన్ తుఫాన్ గండం పొంచి ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళఖాతంలో కేంద్రీకృతమైన ఆంఫన్ పెను తుఫాన్ ‌గా మారనుంది. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు పడే అవకాశముంది. తమిళనాడు పైనా అంఫన్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా ఇప్పటికే దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్‌లలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీచేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుఫాన్ గా మారింది. సోమవారం సాయంత్రానికి పెను తుఫాన్ గా మారనుంది. ప్రస్తుతం ఆంఫన్ తుఫాన్ పారాదీప్ దక్షిణ దిశగా 790 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని డిగా ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 940 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని కెఫాపుర ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెను తుఫాన్ గా మారనుంది. డిగా, బంగ్లాదేశ్ హతియా దీవుల మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.