English | Telugu

స్టైరీన్తోనూ సహజీవనం చేయాలా?: పవన్

స్టైరీన్ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా?అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. పరిష్కారం ఎప్పుడు? నిలదీశారు. దైన్యంగా మిగిలిన బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరీన్ మృత్యువాయువుతో సైతం సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని పవన్ ఎద్దేవాచేశారు.పారిశ్రామిక వృద్ధి ముఖ్యమే అని, అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా అంతకంటే ముఖ్యమని పవన్ అన్నారు.
పారిశ్రామికాభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారుని దుయ్యబట్టారు. ఆ కేసు దర్యాప్తులో ఇంత వరకు ఎటువంటి పురోగతీ కనిపించడం లేదన్నారు.
స్టైరీస్ గ్యాస్ పీల్చిన వారు భవిష్యత్లో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావని, గ్యాస్ బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని పవన్ అన్నారు.