English | Telugu

కూటమి పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ ఎలక్షన్ ఫండ్స్

తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది. రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి.

ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.

ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది. పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.

తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.

వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.