English | Telugu
మండలిలో విజయం గుండె ధైర్యాన్ని ఇచ్చిందంటున్న రైతులు
Updated : Jan 23, 2020
షరీఫ్ నినాదాలతో తుళ్లూరు మహా ధర్నా శిబిరం మారుమోగిపోతోంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు సెలెక్టు కమిటీ పంపాలన్న ఆయన నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిందంటూ రాజధాని రైతులు, మహిళలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహాధర్నా 36 రోజులను పూర్తి చేసుకుంది. నేడు 37 వ రోజు మహాధర్నా శిబిరంలో పాల్గొన్నారు. ఇన్ని రోజులు పడిన శ్రమకు కాస్త ఉపశమనం లభించిందని అంటున్నారు రైతు జేఏసీ. తమ గోడును శాసన మండలి కనీసం ఆలకించిందని.. ఈ ఉపశమనం మాత్రం తమకు గొప్ప మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందంటున్నారు.
నిన్న ( జనవరి 22వ తేదీన ) జరిగిన శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లుకు తాత్కాలిక బ్రేక్ పడింది . న్యాయ పోరాటం చేయటం వల్ల న్యాయం గెలిచిందని.. ఈ ఉద్యమానికి ఇదే మొదటి విజయం అని రైతులు అంటున్నారు. ఇక్కడితో ఇది ఆగదని అమరావతి ప్రజలు వెల్లడించారు. శాసన మండలి తీర్పుతో ఉద్యమాలు చేసేవాళ్ళకి మరింత బలం చేకూరుతుందని అమరావతి ప్రజలు తెలియజేస్తున్నారు. అమరావతిని అక్కడ నుంచి కదిలివ్వమని చెప్పేవరకు న్యాయ పోరాటం సాగుతూనే ఉంటదని అన్నారు. నిన్నటి తీర్పు అందరికి గుండె నిబ్బరం, స్ఫూర్తిని నింపిందని అక్కడి ప్రజలు తెలిపారు.