English | Telugu
సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు... బాబుతో టచ్ లో ఉన్నారు
Updated : Jan 23, 2020
సాధారణంగా విపక్ష ఎమ్మెల్యేలు... అధికార పార్టీతో టచ్ లో ఉండటం సహజం. వీలు కుదిరితే, అధికార పార్టీలోకి జంప్ చేస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీయే... రివర్స్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ గంభీరం ప్రదర్శిస్తూ ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనే చేసి ఇరకాటంలో పడ్డారు. జగన్ చేసిన ఆ ప్రకటన తర్వాతే... ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు... 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని షాకిచ్చారు. అయితే, ఇలాంటి ప్రకటనలు... మెజారిటీ ఫిగర్ కు కొంచెం అటూఇటుగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య బలాబలాలు ఉన్నప్పుడు చేస్తేనే కొంతలో కొంత నమ్మశక్యంగా ఉంటాయి. కానీ, అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్నపుడు అలాంటి ప్రకటనలు బెడిసికొడుతుంటాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే జరిగింది.
అయితే, టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య ఇప్పుడు అలాంటి ప్రకటనే చేశారు. సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తీరుతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని... వాళ్లంతా చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని... త్వరలోనే వాళ్లు టీడీపీలో చేరతారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాబోయే కాలమంతా జగన్ కు అగ్నిపరీక్షే అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకెళ్తోన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు తప్పవన్నారు. అయితే, వేమూరి ఆనంద సూర్య వ్యాఖ్యలు అంత నమ్మశక్యంగా లేకపోయినా... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రకటనలాగే పరిగణించాల్సి ఉంటుంది.