English | Telugu
సొంత పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టించిన రోజా!!
Updated : Jan 6, 2020
సొంత పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా కేసు పెట్టించారనే విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్‌పురంలో.. గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజకోసం వెళ్తున్న రోజా కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల్లో కష్టపడిన తమను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారి చెప్పిన స్ధానంలోనే గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను దూరం పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
రోజా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. చాలాసేపు రోజా కారుని అలాగే నిలిపివేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి వారితో మాట్లాడి రోజాని అక్కడి నుండి తీసుకెళ్లాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనతో రోజా తీవ్ర అసహనానికి లోనయ్యారని తెలుస్తోంది. అందుకే పుత్తూరులోని పోలీస్ స్టేషన్‌లో తన అనుచరులతో రోజా కేసు నమోదు చేయించారని సమాచారం. 30 మంది కేబీఆర్‌పురం వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.