English | Telugu
మండలి రద్దు ఆలోచనపై మేధావులు ఏమంటున్నారు?
Updated : Jan 23, 2020
శాసనసభలో జగన్ ప్రకటన తర్వాత నిజంగానే మండలిని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే లాభనష్టాలేంటి? రద్దుకు ఎంత టైమ్ పడుతుంది? ప్రక్రియ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, మేధావులు మాత్రం మండలి రద్దు దిశగా ఆలోచన చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇంట్లో ఏదైనా పాడైతే... బాగు చేసుకోవాలే తప్ప... మొత్తం ఇల్లే తగలబెట్టుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. చీమలు పడితే... చీమల్ని తీసేయాలి కానీ... మొత్తం బెల్లాన్నే పడేస్తామంటే ఎలా అంటున్నారు. మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ముగిసేపోయే సమస్యకు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటున్నారు. మండలిలో విపక్షానికి బలముంటే... కేవలం మూడు నెలలు మాత్రమే ఆపగలరని, కానీ, పూర్తిగా అడ్డుకోలేరని గుర్తుచేస్తున్నారు. మరి, ఇంత చిన్నదానికి, మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయడం సరికాదని చెబుతున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా తొందరపాటు చర్యే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
మండలి ఉండాలా? వద్దా? అవసరమా? కాదో? చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అంటున్నారని, అయితే... ప్రభుత్వాధినేతగా కౌన్సిల్ ను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే... వైసీపీలో అడ్డుచెప్పగలవారు ఎవరున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కేవలం, మూడు నాలుగు నెలలు ఆగితే సమస్య పరిష్కారమవుతుందని... మండలిలో విపక్షానికున్న బలంతో బిల్లులు ఆలస్యమవుతాయో గానీ ఆపలేరని గుర్తుచేస్తున్నారు. అయినా, ఓ మూడు నెలలు ఆలస్యమైతే ఏమవుతుందని అంటున్నారు. ఒకవేళ మండలి రద్దుకు నిర్ణయం తీసుకుంటే... ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది లేదా ఏడాదిన్నర పట్టొచ్చని.... ఒక్కోసారి పార్లమెంట్లో ఆమోదం పొందకపోవచ్చని గుర్తుచేస్తున్నారు. అయినా, ఒక్క ఏడాది లేదా ఏడాదిన్నర ఓపిక పడితే... మండలిలో కూడా వైసీపీకి మెజారిటీ వస్తుందని, అలాంటప్పుడు రద్దు దిశగా అడుగులు వేయడం ఎందుకంటున్నారు.
అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు పోతే మాత్రం మండలి రద్దు జరగడం ఖాయమంటున్నారు మేధావులు. మండలిలో పరిణామాలను తనను తీవ్రంగా బాధించాయని జగన్ వ్యాఖ్యానించడంతో రద్దు దిశగా వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.... తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో ఉంటే మాత్రం మండలి రద్దు తప్పదు. అయితే, సోమవారానికి ఇంకా మూడు రోజులు సమయం ఉండటంతో ఈలోపు టీడీపీ ఎమ్మెల్సీలతో ఏమైనా లాబీయింగ్ జరుగుతుందేమోనన్న మాట కూడా వినిపిస్తోంది.