English | Telugu
గజం లక్షన్నర... చుక్కల్లో విశాఖ భూములు
Updated : Dec 24, 2019
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం... ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇవ్వడంతో.... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమైపోయింది. అంతేకాదు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్వయంగా భీమిలి ప్రాంతంలోనే రాజధాని మహానగరం రాబోతోందంటూ ప్రకటించడంతో... విశాఖలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. విశాఖతోపాటు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున ల్యాండ్ ట్రేడింగ్ జరుగుతోంది. అయితే, పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందన్న ప్రకటనతో విశాఖ భూములు హాట్ కేకుల్లా మారడమే కాదు... ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.
సాగర నగరం విశాఖలో భూములకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అనే అదనపు హంగు చేరడంతో ఆ డిమాండ్ మరింత రెట్టింపు అయ్యింది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలోని ద్వారకానగర్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, సీతమ్మధరా, ఎంవీపీకాలనీ, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో గజం ధర అక్షరాలా లక్షన్నర రూపాయలు పలుకుతోంది. అదే విశాఖ శివారు ప్రాంతాలైన కొమ్మాది, మధురవాడ, సింహాచలం, పెందుర్తి, రుషికొండ, భీమిలి తదితర ఏరియాల్లో గజం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. ఇక, కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి.
మరోవైపు, ఏపీ రాజధాని నగరంగా విశాఖ మారనుండటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో, భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ల్యాండ్ ట్రేడింగ్ లో 12.5శాతం వృద్ధిరేటు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, రాజధాని వార్తలతో అది మరింత దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకోనుంది. మొత్తంగా విశాఖలో భూములు హాట్ కేకుల్లాగానూ.... ధరలు చుక్కలను తలపిస్తున్నాయి.