English | Telugu
అనంతకు వైద్య విద్యార్థుల మృతదేహాలు
Updated : May 1, 2020
తమ పిల్లల మృతదేహాలు అప్పగించేందుకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు, కేంద్రప్రభుత్వ పెద్దలకు మృతుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కదిరిలో రేవంత్ కుమార్, యాడికి మండలం నిట్టూరులో వంశీకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు విద్యార్థుల మృతదేహాలకు నివాళులు అర్పించారు.
అసలేం జరిగిందంటే? : కదిరి పట్టణంలోని మెయిన్ రోడ్‌లో ఉంటున్న ఎల్‌ఎల్‌వీ క్లాత్ సెంటర్ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు.
వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌తో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా వారి మృతదేహాలు భారత్‌కు రావడం కష్టంగా మారింది.
విద్యార్థుల మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన ఖర్చుకు వెనకాడవద్దని అధికారులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విదేశాంగశాఖ మంత్రికి సీఎం లేఖ రాసి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు.