English | Telugu

కేసీఆర్‌-జ‌గ‌న్‌ మధ్య జ‌ల‌జ‌గ‌డం! మ‌రో పోరాటానికి సిద్ధ‌మంటున్న టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి

ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని నికర జలాల్లో ఏపీ, తెలంగాణకు 811 టీఎంసీలను కేటాయించగా... వాటిలో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అంతా క్లారిటీగా ఉంటే... మరి వివాదం ఎందుకు వచ్చిందన్నది కీలక అంశం.

కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని సంవత్సరాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. అప్పుడు కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీల కంటే ఎక్కువ నీరు వస్తుంది. ఆ ఎక్కువ నీరును ఎలా పంచుకోవాలి అన్నది ఇప్పటివరకూ డిసైడ్ చెయ్యలేదు. ఎందుకంటే... అలా ఎక్కువ నీరు వస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ మిగులు జలాలపై రచ్చ నడుస్తోంది.

రాయలసీమ జిల్లాల్లోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలంటే పోతిరెడ్డిపాడు ద్వారానే సాధ్యమవుతుంది. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో 854 అడుగులు ఎత్తులో నీటి లభ్యత ఉండాలి. జీఓ 69 ప్రకారం నీటి మట్టం 834 కి కుదించారు. మరో వైపు వరదలు వచ్చినపుడు కూడా రోజుకు నాలుగు టీఎంసీల నీరు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. వాటిని ప్రాజెక్టులకు తరలించే కాల్వల నిర్మాణం సరిపడే రీతిలో లేవు. ఫలితం 2 నెలల వరద 1500 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి కిందకు విడుదల చేసినా 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న సీమలో నింపింది 60 , 70 టీఎంసీల నీరు మాత్రమే.

వాస్తవానికి రాయలసీమకు అన్నీ కలిపి 131 టీఎంసీల నీటి హక్కు ఉంది. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం పెంచినా కూడా వరదల సమయంలో పూర్తి హక్కును వాడుకోలేం. ప్రత్యేకించి సముద్రం పాలు అవుతున్న నీటిని వాడుకునే అవకాశం లేదు. అలాంటి సమయంలో సిద్దేశ్వరం సమీపంలో శ్రీశైలంలో 800 - 854 అడుగుల మధ్య రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడుకు డైవర్షన్ స్కీమ్‌తో బనకచర్ల కు వెళ్లే దారిలో 6వ కిలోమీటరు వద్ద కలుపుతారు.

శ్రీశైలంలో 800 - 854 అడుగులు మధ్య ఉండే నీటి విలువ 60 - 80 టీఎంసీలు మాత్రమే. ఈ మొత్తం కూడా నూతనంగా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలింపు సాధ్యమేనా ? అని ప్రశ్నించుకుంటే.. కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎత్తిపోతల ఉద్దేశం 3 టీఎంసీలు. కానీ ఇది 854 అడుగులు ఉన్నపుడు లిఫ్ట్ చేసినట్లుగా అంతకన్నా దిగువ ఉన్నపుడు సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా శ్రీశైలం నుంచి కుడి , ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూనే ఉన్నారు. మొత్తం నీరు రాయలసీమకు తరలిస్తారన్న విమర్శ సరికాదు. వరదలు ఉండి సముద్రంలోకి విడుదల చేసే సమయంలో ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ చర్య వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని బిజెపి ఆందోళ‌న‌కు దిగింది.

పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీళ్లను తరలించడం దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇది తెలంగాణ ఏర్పాటు లక్ష్యానికే తూట్లు పొడిచినట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఘోటుగా విమ‌ర్శిస్తోంది. పోతిరెడ్డిపాడుపై దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చింది.

కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

వాస్త‌వానికి రాయలసీమకు 131 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికి తీసుకుంటున్న నీరు సగం మాత్రమే. ఇక నీటి దోపిడీకి అవకాశం ఎక్కడ? నీటి దోపిడీ జరుగుతోందని. ఇలాంటి ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం, నేతలు తరచూ చేస్తున్నారు. తెలంగాణా రాజకీయ పార్టీలు ఒక్కటై వారి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఉద్య‌మానికి సిద్ధం అయ్యారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం రాజకీయ పార్టీలు తగిన రీతిలో స్పందించడం లేదు.