English | Telugu
పాఠశాలకు రంగులేసిన క్వారంటైన్ వలసకూలీలు!
Updated : Apr 23, 2020
మనసులోని కృతజ్ఞతాభావం వారిని ఊరకే కూర్చోనీయలేదు. ''సార్! పాఠశాల గోడలకు సున్నం రాలి, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మాకు పెయింట్ ఇప్పించండి చాలు. రంగులేస్తాం'' అన్నారు పెద్దలతో. ప్రతిఫలంగా వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. గత తొమ్మిదేళ్లుగా ఆ పాఠశాలలకు ఎలాంటి సున్నం వేయలేదట. ఇప్పుడు కొత్త భవనాల్లా తళతళలాడుతున్నాయి.
హరియానా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన 54 మంది కూలీలకు... రాజస్థాన్‌లోని సికార్ జిల్లా, పల్సానా పరిధిలోని షాహిద్ సీతారాం కుమ్వాత్, సేథ్ కె.ఎల్.తంబి ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు బస ఏర్పాటు చేశారు. పల్సానా సర్పంచి రూప్‌సింగ్ షెకావత్ వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. క్వారంటైన్ మొదలైంది.
రోజులు గడుస్తున్నాయి. అయితే ఆ కార్మికుల మనసులు ఆగలేదు. తాము ఉంటున్న పాఠశాలలను శుభ్రం చేశారు. చిన్న చిన్న రేపేర్లు చేయడమే కాదు రంగులేస్తామని సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులు కూడా ముందుకొచ్చి తలో కొంత వేసుకుని... కావలసిన రంగులు, సరంజామా సమకూర్చారు.
అంతే. వలస కార్మికులంతా కలిసి పాఠశాలల ఆవరణలను శుభ్రం చేసి, గోడలకు రంగులు వేసి వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి క్వారంటైన్ కూడా పూర్తయింది. కష్టానికి ప్రతిఫలంగా డబ్బులిచ్చినా... కార్మికులు తీసుకోలేదని, వారి మంచి హృదయానికి తమ ప్రజలు ఎంతో సంబర పడుతున్నారని షెకావత్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి. చిన్న బతుకులు పెద్ద మనసుతో వ్యవహరించారని నెట్‌జనులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.