English | Telugu
ఏపీలో నాటుసారా ఏరులై పారుతోంది! స్పీకర్ తమ్మినేని
Updated : Apr 25, 2020
గతంలో సారా తాగి ప్రజలు రోగాల పాలయ్యేవారు. కుటుంబాలు వీధిన పడేవి. సారా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పల్లెల్లో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది!!
రాష్ట్రంలోని పల్లెల్లో సారా మళ్లీ ఏరులై పారుతోంది. నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సారాకు బానిసై జనం అటు జేబులను ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అధికారుల అమ్యామ్యాలతో సారా తయారీ మళ్లీ ఊపందుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం దొరక్కపోవడంతో చక్కెర వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మొలాసిస్‌తో నాటు సారా కాస్తున్నారు. కల్తీ సారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
అధికారులు సైతం మామాళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సారా తయారీదారుల నుంచి ముట్టాల్సినవన్నీ ముట్టుతున్నాయని, అందుకే చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.