English | Telugu

బీజేపీ విద్వేష వైరస్‌! మత సామరస్యానికి తీరని నష్టం

రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకున్న వలస కార్మికులను కరోనా పరీక్షలు నిర్వహించి, సొంత రాష్ట్రాలకు అనుమతించాలని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ డిమాండ్‌ చేశారు. వారిని ఇళ్లకు చేర్చే బాధ్యతను సొంత రాష్ట్రాలు తీసుకోవాలని కోరారు. కరోనాపై పోరాటంలో కేంద్రం రాష్ట్రాలకు అండగా నిలబడాలని, ఆర్థికంగా అండదండలు కల్పించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది.

దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే కేంద్రంలోని మోదీ సర్కారు పిసినారిలా వ్యవహరిస్తూ అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రజల కష్టాల పట్ల సానుభూతి, విశాల హృదయం, వేగంగా స్పందించే తత్వం కేంద్ర ప్రభుత్వంలో లేదని దుయ్యబట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బీజేపీ మత విద్వేషాలవైర‌స్‌ను వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. ‘‘కరోనా వైర‌స్‌పై దేశమంతా ఒక్కటిగా పోరాటం చేస్తుంటే బీజేపీ మత విద్వేషమనే వైరస్‌ వ్యాప్తిని కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని పాల్గార్‌లో లాక్‌డౌన్‌ సమయంలో వాహనంలో వెళుతున్న హిందూ సాధువుల్ని పిల్లలను ఎత్తుకెళ్లే వారిగా అనుమానించి, కొట్టి చంపిన ఉదంతాన్ని బీజేపీ వివాదాస్పదం చేయడాన్ని సోనియా పరోక్షంగా ప్రస్తావించారు.

వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్ల సంఖ్య, నాణ్యత బాగా తక్కువగా ఉందని అన్నారు. సరైన రక్షణ పరికరాలు లేకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి భారత ప్రజలు వందనం చేయాలన్నారు. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పాల్గొన్నారు. సోనియాగాంధీ అధ్యక్షోపన్యాసం చేశారు.