English | Telugu

20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలుంటాయి...?

20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అర్థం కాక దేశ ప్ర‌జ‌లు జుట్టు పీక్కుంటున్నార‌ట‌.2014 నుండి అంధ్రప్రదేశ్ కు ఒక లక్ష కోట్లు ఇచ్చాము అని అప్ప‌ట్లో మోదీ ప్ర‌‌భుత్వం ఏవో కాకి లెక్కలు చూపించినట్లుగానే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజి? మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యుడికి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శిస్తోంది.

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి వల్ల పేదలకు వచ్చే లాభం ఏంటి? కార్మికులను, వలస కూలీలను , రైతులను పట్టించుకోకుండా కేవలం పారిశ్రామిక వర్గాల పక్షంగా కేంద్ర ప్ర‌భుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. మరో సారి సూటు - బూటు సర్కారు అని మోడీ ప్రభుత్వం రుజువు చేసుకుంద‌ని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.

కరోనా నుంచి దేశాన్ని కాపాడాల్సిన కేంద్రం ప్రజల జీవితాలు గాలికి వదిలేసింది. ఆర్థిక పరిపుష్టి పెంచే చర్యల పేరుతో పేదల కడుపుకొడుతోంది. వలస కూలీల పైన కరుణించని మోడి సంస్కరణల పేరుతో ఉన్న ఉపాధి పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌క‌టించారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉంది. ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని బాధాకరం.

లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలస కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. దేశంలోని పేదలకు డబ్బుల పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. 13 కోట్ల కుటుంబాలు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రభుత్వ చెబుతున్న సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయింది.

20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఇప్పటి వరకు కేంద్రం 3.6 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించింది. మిగిలిన 16.4 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలి. కానీ అలా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎక్కువ రుణాలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకోవాడానికి, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి అనుమతించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు’

అసలు సమస్య ఏంటి అంటే అంత పెద్ద డబ్బు ప్రభుత్వం ఎలా సమకూర్చుతుంది. కొత్తగా ముద్రిస్తుందా !! అలాంటి అవకాశమే లేదు. (ప్రభుత్వం కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే ముద్రించే అవకాశం ఉంది.)

RBI ప్రధాన మరియు ద్వితీయ మార్కెట్లలో నుండి G-secs కొనుగోలు చేయనుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి, ఇదే నిజమైతే ప్రజలు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది, ఇది మొత్తం దేశం మునిగిపోయేలా చేస్తుంది. ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం చూస్తుంది. నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఇది అందినప్పుడే ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజీ విజయం సాధించినట్టు.

ఈ నగదు పంపిణీ కూడా ప్రభుత్వ బ్యాంకుల మీద పెడితే, నోట్ల కొరతలో దేశం ఇబ్బందుల పాలవుతుంది. ఈ సొమ్మును మళ్ళీ బడా బడా కంపెనీలకు అప్పులు ఇస్తే మళ్లీ అవి NPAలు ( non-performing- asserts ) గా మారే ప్రమాదం లేకపోలేదు, ఇది కూడా ప్రజల మీద భారంగా మారుతుంది.

చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు ఈ ప్యాకేజి అందేలా ప్రభుత్వం చూడాలి, అప్పుడే ఈ ఆర్ధిక సమస్య నుండి బయట పడే అవకాశం ఉంటుంది. covid వల్ల నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వం సిద్దం చెయ్యాలి. ఈ పని కూడా బ్యాంకుల మీద వదిలేస్తే వాళ్ళు మళ్ళీ అదే పెద్ద పెద్ద కార్పరేట్ లకు లాభం చేసేలా పనిచేస్తాయి. ఇలాంటి ప్రభుత్వ ప్యాకేజిలు కాగితాల మీద ఎంత బాగున్నా, అవి పేద వాడికి చేరడంలో మాత్రం ఎప్పడు విజయం సాదించలేదు.