English | Telugu

మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే!

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో మన అనుకున్నవారి ఇంటికి కూడా మనం వెళ్లలేక పోతున్నాం కదా? మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు మనకు ఎలా తెలుస్తున్నాయి? మనం ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు కూడా మన ఇంటికి రావడం లేదు. కనీసం మన వీధికి కూడా రావడం లేదు (ఏమో ఒకరిద్దరు వస్తున్నారు!) కదా.. మరి మన సమస్యలు ప్రభుత్వానికి ఎలా చేరుతున్నాయి? వారధి ఎవరు? అంటే తడముకోకుండా చెప్పే మాట మీడియా ఉందికదా!? అని! నిజమే. మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే! మీడియాలో పనిచేస్తున్నది కూడా మనలాంటివారే! వారికీ కరోనా ఎఫెక్ట్ పొంచే ఉంది. వారిపైనా అనేక నిషేధాజ్ఞలు ఉన్నాయి. పోలీసుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. లాఠీల భయం కూడా పొంచే ఉంది. ప‌ని చేసే యాజ‌మాన్యం ఎప్పుడు ఉద్యోగంలో నుంచి పీకివేస్తోందో తెలియ‌దు.

అయినా.. వారు ఎంచుకున్న వృత్తి ధర్మానికి పాత్రికేయులు పాటు పడుతున్నారు. అందుకే ప్రజలకు ఇంట్లో ఉన్నా.. ప్రపంచం మొత్తం వారికి చేరువ అవుతోంది. దేశంలో ఏ క్షణాన ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో.. ప్రభుత్వం చెబుతోంది. అయితే, దీనికి కారణాలు ఏంటి? ఎక్కడెక్కడ కరోనా విజృంభించే అవకాశం ఉందనే విషయాలపై సమగ్ర పరిశోధనాత్మకంగా సమాచారం ఇస్తూ.. పాత్రికేయులు ఇంత ఘోర కరోనా కాలంలోనూ తమ వృత్తి ధర్మానికి కట్టుబడ్డారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిజానికి సమాజంలో ఏం జరుగుతోందో చెబుతున్నప్పటికీ.. ఇంత శ్రమ తీసుకుంటున్నప్పటికీ.. పాత్రికేయులను గుర్తించేవారు.. వారి పేరును స్మరించేవారు ఒక్కరంటే ఒక్కరు ఒక్క ప్రభుత్వం అంటే ఒక్క ప్రభుత్వం కూడా లేదంటే నమ్మితీరాలి.

కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, వైద్య సిబ్బందికి .. ఆయుష్మాన్ భారత్ కింద 50 లక్షల బీమా ఇచ్చింది. కానీ, అదే వాతావరణంలో అదే ఆసుపత్రుల్లో పనిచేస్తూ.. వార్తలు సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి ఏంటి? వారికి కనీస అవసరాలు తీర్చేవారు ఎవరు? మాస్కులు లేవు. సంస్థలు ఇవ్వవు. కనీసం వారికి సమయానికి ఆహారం కూడా లేదంటే.. నమ్ముతారా? అయినా ఇది పచ్చినిజం. మనం ఇంట్లో ఉండి సమయానికి అన్నీ వండుకుని తింటున్నాం. ఉదయాన్ని వెళ్లి మనకు అవసరమైన వాటిని తెచ్చుకుంటున్నాం. మరి జర్నలిస్టు కుటుంబాలు ఇలా చేస్తున్నాయా?

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితి కొంత మంది మీడియా యాజమాన్యాలకు గొప్ప వరంగా మారింది. దీనిని సాకుగా చూపించి ఎడాపెడా ఉద్యోగాలకు కోత మొదలుపెట్టారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు బిజినెస్ స్టాండర్డ్ జీతాల తగ్గింపు తీసుకోవాలని సిబ్బందిని కోరింది. ఔట్‌లు ముద్రణ ప్రచురణను నిలిపివేసింది. న్యూస్ నేషన్ 16 ఇంగ్లీష్ డిజిటల్ ఉద్యోగులను తొలగించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా మొత్తం ఆదివారం స్పెష‌ల్ టీం ను తొలగించింది. క్వింట్ బృందంలో సగం మంది జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని కోరారు. ఇండియా టుడే 46 మంది రిపోర్టర్లు, 6 మంది కెమెరామెన్లు మరియు 17 మంది న్యూస్ ప్రొడ్యూస‌ర్‌ల‌ను తొలగించింది.

ఉదయాన్ని పుస్తకం పెన్ను పట్టుకుని ఫీల్డ్ లోకి వెళ్తున్న జర్నలిస్టు.. ఎప్పుడు ఇంటికి వస్తాడో చెప్పలేని పరిస్థితి! ఎలా వస్తాడో కూడా తెలియని పరిస్థితి!! అయినా ఆయనను మ‌నిషిగా చూడ‌డం లేదు. పాత్రికేయుడిని పట్టించుకునేవారు ఎవరు? వారికీ కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం!