English | Telugu
కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఈయూ ఎంపీల బృందం
Updated : Oct 30, 2019
జమ్ము కశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ఎంపీలు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. స్థానికులు అధికారులతో పలు అంశాలపై చర్చించారు ఈయూ ప్రతి నిధి బృందం సభ్యులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో తొలిసారి విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. బుధవారం కూడా కాశ్మీర్ లో ఈయూ బృందం పర్యటన కొనసాగనుంది. శ్రీనగర్ లోని చారిత్రక దాల్ లేక్ ను యూరోపియన్ల బృందం సందర్శించింది. దాల్ సరస్సు అందాలను చూసి ముగ్ధులయ్యారు యూరోపియన్లు.
బోట్లలో కూడా వాళ్లు విహరించారు, స్థానిక వ్యాపారులతో కూడా బృందం పలు అంశాల పై చర్చించింది. శ్రీనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయన్న అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు ఈయూ బృందం పర్యటనకు అనుమతి నిచ్చినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. ఆర్మీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కూడా ఈయూ బృందం భేటీ అయ్యింది. కశ్మీర్ లో పాకిస్థాన్ చొరబాట్లను ఎలా ప్రోత్సహిస్తుందో, కుట్రలు చేస్తుందో కళ్ళకు కట్టినట్లు ఈయూ బృందానికి వివరించారు ఆర్మీ అధికారులు.
అయితే ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ తో సహా విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్ష ఎంపీలు శ్రీనగర్ లో అడుగు పెట్టగానే అరెస్టు చేసిన కేంద్రం ఈయూ ఎంపీ బృందానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కశ్మీర్ లో విదేశీ ఎంపీలకు అనుమతులు ఇచ్చి తమను అడ్డుకోవడంపై పార్లమెంటులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి. రైట్ వింగ్ ఎంపీలకు ఎలా అనుమతిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈయూ బృందం ఇప్పటికే ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఈయూ బృందానికి కేంద్రం వివరించింది. అంత వరకూ కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.