English | Telugu

రాజధాని మార్పు, మండలి రద్దు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళనున్న టిడిపి!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ ఎంపీలతో సమావేశమవుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అమరావతి రాజధాని, మండలి రద్దు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో టీడీపీ ఉన్నట్టు సమాచారం. కాసేపట్లో టిడిపి కార్యాలయంలో పార్టీ ఎంపీలతో టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మండలి రద్దు, అమరావతి రాజధాని అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే త్వరలో జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహం మీద ఎంపీలతో చర్చించనున్నారు.

మధ్యాహ్నం అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు, ఎందుకంటే నిన్న మండలి రద్దు జరిగిన తరువాత అనంతరం జరుగుతున్న పరిణామాల మీద ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, ప్రధాని మరియు కేంద్ర మంత్రులను కలవాలని, అమరావతి జె ఎ సి ని కలుపుకొని ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలని తెలుగు దేశం పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో బైక్ ర్యాలీలకు టిడిపి పిలుపునిచ్చింది.

అలాగే రేపు తెనాలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మండలిలో ఎలాంటి ప్రలోభాలకూ ఒత్తిళ్లకు లొంగకుండా నీతిగా, నిజాయితీగా నిలబడినటువంటి ఎమ్మెల్సీలను రేపు తెనాలి బహిరంగ సభకు ఆహ్వానించి సన్మానం చేయాలని టిడిపి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలూ, బహిరంగ సభలు నిర్వహించాలని టిడిపి, అమరావతి జేఏసీ నిర్ణయించింది. అయితే అన్ని పార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలనేది టిడిపి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.