English | Telugu

కేసులు తగ్గించి చూపే ప్రయత్నం చేయడంలేదు: సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని అన్నారు. కోవిడ్‌ లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. దేశంలోనే రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని, రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ప్రతి 10 లక్షల మందికి 31వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. అందులో సగం మందికి నయమైపోయిందని అన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోయినా.. మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేశామని సీఎం పేర్కొన్నారు.