English | Telugu
విజయారెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు!!
Updated : Nov 6, 2019
తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి, పోలీసులు హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పలు కీలక ఆధారాలు సేకరించింది. విజయారెడ్డి ఆఫీస్ లోని గడియారం మధ్యాహ్నం 1:55 నిమిషాలకు ఆగిపోయింది. ఈ ఆధారంతో దర్యాప్తు చేసిన క్లూస్ టీం సంఘటన 1:45 నిమిషాలకు జరిగినట్టు నిర్ధారించారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే విజయా రెడ్డి ప్రాణాలు విడిచినట్టు నిర్ధారణకొచ్చారు. సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గర పది నిమిషాలకు పైగానే తిరుగుతూ మంటలార్పే ప్రయత్నం చేశాడు. సగం మంటలు ఉండగానే మండల కార్యాలయం నుంచి నడుచుకుంటూ 2:35 నిమిషాల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు.
నిందితుడు సురేష్ తన వెంట రెండు లీటర్ల బాటిల్ లో పెట్రోల్ కలిపిన కిరోసిన్ తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది. దాన్ని విజయారెడ్డిపై చల్లాడు, అయితే అది ఆమె ఒంటిపై ముందున్న టేబుల్ కుర్చీపై పక్కన పేపర్లపై పడింది అలాగే సురేష్ పై కూడా పడింది. క్షణాల్లోనే తనతో పాటు తెచ్చుకున్న అగ్గిపెట్టెతో మంటలు అంటించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా విజయా రెడ్డికి మంటలు అంటుకోవడంతో పాటు చుట్టు పక్కల కూడా వ్యాపించాయి. కిరోసిన్ అందులో కలపడంతో వెంటనే దట్టంగా పొగలు వచ్చాయి, ఈ పొగతో ఆమె ఛాంబర్ లో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం కార్బన్ మోనాక్సైడ్ గది అంతా వ్యాపించడంతో ఆమె దాని పీల్చుకుంది దీంతో నిమిషాల వ్యవధి లోనే విజయారెడ్డి ప్రాణాపాయ స్థితికి చేరి తన ఛాంబర్ నుంచి బయటకు మంటలలో కాలుతూ వచ్చి డోర్ దగ్గర కుప్పకూలిపోయింది.
కర్టెన్స్ కు మంటలంటుకోవడంతో కాలిపోయాయి. ఈ మంటల వేడికి తలుపు పై భాగంలో ఉన్న గోడ గడియారం 1:55 నిమిషాలకు ఆగిపోయింది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంగుళాన్ని గాలించి ముప్పై రకాలైన నమూనాలను సేకరించింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు, కిరోసిన్ ఆనవాళ్లు లభించాయని ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు క్లూస్ టీం అధికారులు. కిరోసిన్ కు ఎక్కువ సేపు మండే స్వభావం ఉంటుంది, పెట్రోల్ త్వరగా అంటుకున్న ఆవిరి స్వభావం ఎక్కువగా ఉండటంతో పాటు అంతే త్వరగా మంటలు కూడా ఆరిపోయే అవకాశాలుంటాయి. దీంతో నిందితుడు కిరోసిన్ లో పెట్రోల్ కలుపుకొని వచ్చినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
అటు గౌరల్లిలో రోడ్డు పక్కన చిన్న దుకాణంలో పెట్రోల్ కొన్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. తహసీల్దార్ ఛాంబర్ లో మంటలు అంటుకోవడానికి ఉపయోగించిన కిరోసిన్, పెట్రోల్ ఆనవాళ్లు అగ్గిపెట్టె, పూర్తిగా కాలిపోయన రెండు లీటర్ల బాటిల్ తదితర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. దీనిపై మరింత స్పష్టత వచ్చాకే అధికారికంగా చెబుతామన్నారు పోలీసులు. నిందితుడు మధ్యాహ్నం 1:45 నిమిషాలకు చాంబర్ లోకి వెళ్లి ఆమెను సజీవ దహనం చేశాడు.
తనక్కూడా మంటలంటుకున్న సురేష్ కార్యాలయం వద్దనే కొద్దిసేపు ఉన్నాడు, ఎవరో బాధితులు తమ పని కాకపోవడంతో ఒంటికి నిప్పంటించుకున్నారనే భావనలో అక్కడున్న వారు భావించారు. తన ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసుకునేందుకు బట్టలు విప్పేసిన సురేష్ అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మండల ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మధ్యాహ్నం 02:25 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు దర్యాప్తుకు కీలకంగా మారాయి.