English | Telugu

13 మంది న్యాయమూర్తులు.. 66 రోజులు... 

ఏప్రిల్ 24, 1973.... సరిగ్గా 47 సంవత్సరాల క్రితం ఇదేరోజు భారత దేశ చరిత్రలో చెప్పుకోదగిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడింది. సుప్రీం కోర్టులోని 13 మంది న్యాయమూర్తులు 66 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి 11 తీర్పులు 4 రోజులపాటు వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రి తో పాటు 13 మంది న్యాయమూర్తుల్లో మన తెలుగువారు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. కేరళ ప్రభుత్వం భూసమీకరణలో భాగంగా తీసుకున్న చర్యలను ప్రత్యేకించి తన మఠం భూములు కూడా సమీకరించడాన్ని వ్యతిరేకిస్తూ స్వామి కేశవానంద భారతి వేసిన కేసు చివరికి భారత రాజ్యాంగ ప్రతిపత్తిపై ఒక సమగ్ర వివరణ ఇచ్చిన కేసు. రాజ్యాంగం, రాజకీయం ఘర్షణ పడుతున్న తొలినాళ్ళలో 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన 11 తీర్పులు ఇప్పటికీ మన ప్రజాస్వామ్యానికి రక్షణ గోడలా నిలిచాయి.

ప్రజాస్వామ్యంలోని మూడు మూల స్తంభాలు - పార్లమెంటు, పరిపాలనా రంగం మరియు న్యాయవ్యవస్థ - ఘర్షణ పడకుండా, ఒకరి విధుల్లోకి మరొకరు రాకుండా గీతలు గీసిన తీర్పు. అలాగే రాజకీయం రాజ్యాంగాన్ని ఎంతమేరకు ఉపయోగించుకోవాలో, రాజ్యాంగ సవరణలను న్యాయవ్యవస్థ ఎంతమేరకు అనుమతించాలో కూడా చెప్పిన రోజు. శ్రీమతి ఇందిరా గాంధీ అత్యధికంగా 29 సవరణలు చేశారు. పార్టీలో పెద్ద నేతలు కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటి మహామహులను ఎదుర్కొని లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత దేశ ప్రధానిగా 1966లో బాధ్యతలు చేపట్టిన శ్రీమతి గాంధీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి, కాంగ్రెస్ కురువృద్ధులను ఎదురొడ్డి నిలవడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. వాటిలో కొన్ని ఈ రాజ్యాంగ సవరణలు.

రాజకీయం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పడిన ఘర్షణ, శ్రీమతి గాంధీ నాయకత్వం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి వంటి అంశాలు విశేషంగా చర్చ జరిగిన అత్యంత ప్రముఖమైన కేసు ఇది. ఈ కేసు తర్వాత రాజ్యాంగం మారుతూనే వస్తోంది. న్యాయమూర్తులు మారుతూనే ఉన్నారు. కానీ రాజ్యాంగ మౌళిక సూత్రాలు మాత్రం అభేద్యంగా నిలిచి ఉన్నాయి. అదే భారత ప్రజాస్వామ్య గొప్పతనం. ఏ వ్యవస్థలో అయినా కొన్ని చెదపురుగులు రావచ్చు, కానీ అవేవీ రాజ్యాంగ మౌళిక సూత్రాలను మార్చలేవు. అలాగే మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని మార్పులు అవసరం కావచ్చు కానీ రాజ్యాంగ మౌళిక స్వరూపం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.