English | Telugu

ఏంటి పూరీ ఇలా చేశావ్...?!

నంద‌మూరి బాల‌కృష్ణ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబో అన‌గానే బాల‌య్య అభిమానులు షాక్ అయ్యారు. ఇదేం కాంబినేష‌న్ అంటూ కాసేపు ఆశ్చ‌ర్య‌పోయి... ఆ వెంట‌నే పూరి హీరోయిజం గుర్తొచ్చి త‌మ అభిమాన హీరోని కొత్త‌గా చూడొచ్చ‌ని మురిసిపోయారు. అయితే... ఆ త‌ర‌వాత పూరి చేసిన ప‌నులు బాల‌య్య అభిమానుల్ని మ‌రింత ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాయి. బాల‌య్య సినిమా కోసం న‌టీన‌టులు కావాల‌ని పూరి కాస్టింగ్ కాల్ ఇవ్వ‌డం ఇండ్ర‌స్ట్రీని షాక్‌కి గురిచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ అగ్ర హీరో సినిమాకీ ఇలాంటి కాస్టింగ్ కాల్ బ‌య‌ట‌కు రాలేదు.

ఎప్పుడైతే కొత్త హీరోయిన్లు, కొత్త విల‌న్‌, కొత్త కామెడియ‌న్లు అంటూ ప్ర‌క‌టించారో అప్పుడే ఈ సినిమా హైప్ త‌గ్గ‌డం ప్రారంభమైంది. కాస్టింగ్ కాల్‌... బాల‌య్య‌నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని, అందుకే.. ఏంటి పూరీ.. ఇలా చేస్తున్నావ్‌?? అంటూ బాల‌య్య పూరిని నిల‌దీశాడ‌ని తెలుస్తోంది. కొత్త వాళ్ల‌ని ఎందుకు తీసుకోవాల్సివ‌చ్చిందో బాల‌య్య‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాడ‌ట పూరి. దాంతో బాల‌య్య సంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ క‌థానాయిక‌ల వేట‌లో ఉన్నాడు. ఛార్మి ఆడిష‌న్ల ప‌నుల్లో బిజీగా ఉంద‌ని, వారం రోజుల్లోగా కొత్త హీరోయిన్లు ఎవ‌ర‌న్న విష‌యంలో క్లారిటీ వ‌చ్చేస్తుంద‌ని తెలుస్తోంది.