English | Telugu
బాద్షా మనసు దోచుకున్న విజయ్ సేతుపతి
Updated : Jun 13, 2023
మంచి లేడీ ఓరియంటెడ్ సినిమా ఉంది. ఆమెకు సపోర్ట్ చేసే బెస్ట్ హీరో కావాలంటే.. కాంటాక్ట్ విజయ్ సేతుపతి....
మంచి ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ గా సరిపోయే విలన్ కావాలి... కాంటాక్ట్ విజయ్ సేతుపతి....
మంచి వెర్సటైల్ స్టోరీ ఉంది. ఏజ్‌తో సంబంధం లేకుండా అన్ని భాషల వారికీ తెలిసిన హీరో కావాలి... కాంటాక్ట్ విజయ్ సేతుపతి...
రోల్ ఏదైనా, సిల్వర్ స్క్రీన్ మీద రోలర్ కోస్టర్ రైడ్ చూడాలంటే ఒన్ అండ్ ఒన్లీ కాంటాక్ట్ విజయ్ సేతుపతి అన్నట్టుంది సేతుపతి చరిష్మా. అందుకే షారుఖ్ ఖాన్ కూడా తన ఫేవరేట్ కో స్టార్ అంటూ విజయ్ సేతుపతి పేరు చెప్పారు. ఫేవరేట్ యాక్టర్ కూడా సేతుపతే అన్నది బాద్షా చెబుతున్న మాట. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార నాయిక. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రోల్ గురించి షారుఖ్‌ఖాన్ మాట్లాడారు. ``నా దృష్టిలో అత్యంత ప్రతిభావంతుడైన ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి. సౌత్‌లో ఉన్నబెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకరు. హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, విలన్‌గా, ప్రతి కేరక్టర్‌లోనూ ప్రతిభ చూపిస్తారు. అట్ మోస్ట్ పర్ఫెక్షన్ ఉన్న నటుడు. ఉప్పెన, మాస్టర్, విక్రమ్... సినిమా ఏదైనా, సేతుపతి ఉంటే ఇక దేని గురించీ ఆలోచించక్కర్లేదు. ఆయన జవాన్‌లో చాలా కూల్‌గా కనిపిస్తారు`` అని అన్నారు. నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లిలో కలిశారు షారుఖ్, సేతుపతి. ఒకరితో ఒకరు పనిచేయాలని ఉందని అప్పుడే చెప్పుకున్నారు. వెంటనే జవాన్‌తో కోరికను తీర్చేశారు అట్లీ.
జవాన్‌లో నటించడం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ``నేను విలన్‌గా నటిస్తున్నాను. నాకు అట్లీ ఎప్పటి నుంచో తెలుసు. అతనితో ఇప్పటిదాకా ఎప్పుడూ పనిచేయలేదు. అతను నాకు జవాన్‌ని ఆఫర్ చేయగానే వెంటనే ఓకే చెప్పేశాను. షారుఖ్ తో పనిచేయడం నాకెప్పుడూ ఆనందమే`` అని అన్నారు. బాలీవుడ్, కోలీవుడ్ మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు సేతుపతి. త్వరలో ఆరుముగకుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ సినిమాకు పనిచేశారు. లేటెస్ట్ సినిమా పూజా కార్యక్రమాలు మలేషియాలో మొదలయ్యాయి.