English | Telugu
దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది
Updated : Dec 22, 2025
ఇప్పటివరకు ఎన్నో సిరీస్ వచ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇటీవలికాలంలో హిందీలో మంచి విజయాన్ని సాధించిన సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం మలయాళం, హిందీ వెర్షన్లకు సంబంధించిన షూటింగ్స్ జరుగుతున్నాయి. మలయాళ వెర్షన్‌కు జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తుండగా, హిందీ వెర్షన్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్షన్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజయ్‌దేవ్‌గణ్ వాయిస్ ఓవర్‌తో నడిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మూడో భాగంతో దృశ్యం కథ ముగుస్తుందని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘనవిజయం సాధిస్తుందని బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.