English | Telugu

చెర్రీతో పోటీప‌డుతున్న కార్తిక్ ఆర్య‌న్‌!


రామ్‌చ‌ర‌ణ్‌కీ, కార్తిక్ ఆర్య‌న్‌కీ మ‌ధ్య రోజురోజుకీ పోలిక‌లు పెరుగుతున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం గేమ్ చేంజ‌ర్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో నాయిక కియారా అద్వానీ. అటు కార్తిక్ ఆర్య‌న్ ఇటీవ‌ల హిందీలో న‌టించిన సినిమా స‌త్య ప్రేమ్ కీ క‌థ‌. ఇందులో నాయిక కియ‌రా అద్వానీ. ఆల్రెడీ ఆ సినిమాతో కార్తిక్ బాక్సాఫీస్‌ని బ‌ద్ధ‌లు కొట్టేశారు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ వంతు మిగిలి ఉంది.

కియారా మూవీల విష‌యంలో కార్తిక్ ఆర్య‌న్ ముందుంటే, గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ విష‌యంలో రామ్‌చ‌ర‌ణ్ ముందున్నారు. రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్‌కి వెళ్లిన సంద‌ర్భంగా అంద‌రూ రామ్‌చ‌ర‌ణ్‌ని గ్లోబ‌ల్ స్టార్ అంటూ పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. అంతకుముందు మెగాప‌వ‌ర్‌స్టార్‌గానే రామ్‌చ‌ర‌ణ్‌కి బిరుదు ఉండేది. కానీ గ్లోబ‌ల్ స్టార్ అనే పిలుపును ప్ర‌చారంలోకి తీసుకొచ్చారు ఫ్యాన్స్.

ఇప్పుడు కార్తిక్ ఆర్య‌న్ కూడా గ్లోబ‌ల్ సూప‌ర్‌స్టార్ అనే పిలుపు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మెల్బోర్న్ లో జ‌రిగే 14వ ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఆయ‌న్ని రెయిజింగ్ గ్లోబ‌ల్ సూప‌ర్‌స్టార్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా గుర్తించ‌నున్నారు. భార‌తీయ సినిమాకు కార్తిక్ ఆర్య‌న్ అందించిన సేవ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా గౌర‌వించ‌నున్నారు.

ఆగ‌స్టు 11న మెల్బోర్న్ లో ఈ అరుదైన గౌర‌వాన్ని అందిపుచ్చుకోనున్నారు కార్తిక్ ఆర్య‌న్‌. విక్టోరియా గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకుంటారు కార్తిక్ ఆర్య‌న్‌. ``ఈ అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది. గౌర‌వంగా ఉంది. ఇండియ‌న్ సినిమాకు నా వంతు స‌హకారం అందించినందుకు ద‌క్కిన గుర్తింపుగా భావిస్తున్నాను. మ‌న‌సును తాకే సినిమాల‌ను, బుద్ధికి మేధ‌స్సును అందించే సినిమాల‌ను చేయాల‌న్న‌దే నా కోరిక‌. భ‌విష్య‌త్తులోనూ అలాంటి సినిమాల‌ను చేస్తాన‌ని మాటిస్తున్నాను`` అని అన్నారు.