English | Telugu
రణ్వీర్- అలియా సినిమాకు సెన్సార్ బోర్డ్ సూచనలు
Updated : Jul 23, 2023
రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం `రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని`. జూలై 28న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఓ వైపు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో రణ్వీర్ సింగ్, అలియా భట్, కరణ్ జోహార్ బిజీగా ఉన్నారు. మరో వైపు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2 గంటల 48 నిమిషాల వ్యవధితో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ బోర్డ్ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే.. సినిమాలో కొన్ని చోట్లు అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించారు. దాన్ని మ్యూట్ చేయాలని లేదా మరో పదంగా మార్చాలని అన్నారు. అలాగే బ్రా అనే పదాన్ని ఐటెమ్ అని మార్చాలని సూచించారు.
సినిమాలో ఉపయోగించిన మమతా బెనర్జీని ఉద్దేశించి ఉన్న మాటలను పూర్తిగా తొలగించాలని సెన్సార్ బోర్డ్ `రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని` దర్శక నిర్మాతలకు సూచించింది. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఫొటోకి సంబంధించిన సీన్‌లో మార్పులు చేయాలని చెప్పారు. ఓల్డ్ మంక్ అనే మద్యం బ్రాండ్‌ను బోల్డ్ మంక్‌గా మార్చాలని కూడా సూచించారు. సెన్సార్ బోర్డ్ చెప్పిన సలహాలను పాటించటానికి `రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని` టీమ్ రెడీ అయిపోయింది. ఇటీవల వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ను గమనిస్తే.. హీరోది పంజాబీ కుటుంబం. హీరోయిన్‌ది బెంగాలీ ఫ్యామిలీ. ఇద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని భావించిన వారు ఒకరి కుటుంబంలోకి మరొకరు ఫ్రెండ్స్‌లా వెళతారు. ఇంతకీ వారి ప్లానింగ్ వర్కవుట్ అయ్యిందా.. ఇద్దరి ప్రేమకు కుటుంబాలు సమ్మతించాయా? అనేదే సినిమా కథాంశం అని అర్థమవుతుంది.
ఏడేళ్ల తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ ఇతర పాత్రల్లో నటించారు.