English | Telugu

ఐట‌మ్ సాంగ్‌కి నో చెప్పిన హ్యూమా

బాలీవుడ్ నటి హుమా ఖురేషి తర్లా చిత్రంలో సెలబ్రిటీ చెఫ్ తర్లా దలాల్ పాత్రను పోషించినందుకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ప‌లు విష‌యాల గురించి ప్ర‌స్తావించారు. ఓ పాట‌లో లిరిక్స్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఓ ఐట‌మ్ సాంగ్‌కి నో చెప్పిన విష‌యాన్ని కూడా ఆమె ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. ఐట‌మ్ సాంగ్ గురించి మాట్లాడుతూ ``ఓ ఐట‌మ్ సాంగ్‌లో డ్యాన్స్ చేయ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింది. చాలా మంచి సినిమా. పెద్ద నిర్మాత‌. మంచి సాంగ్‌. విన‌గానే చార్ట్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నిపించే ట్యూను. అన్నీ ఓకే అనుకున్నా. రెండు రోజులు రిహార్స‌ల్స్‌కి కూడా వెళ్లా. నాకోసం యూనిట్ కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేశారు. అప్పుడు ఆ పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుచేసుకుంటుంటే, అందులో ద్వందార్థాలు తెలిశాయి.

అస‌లు అంత భ‌యంక‌ర‌మైన అర్థంతో పాట రాశారా అనిపించింది. వెంట‌నే అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. అప్పుడు ఆ పాట చేసి ఉంటే, వ‌రుస‌గా అలాంటి అవ‌కాశాలు చాలానే త‌లుపు త‌ట్టేవి`` అని అన్నారు. మోనికా ఓ మై డార్లింగ్ ప్రాజెక్టుకు సైన్ చేయ‌డం గురించి కూడా ఆమె మాట్లాడారు. ``మ‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను, మ‌నం వాడుకోవ‌చ్చు అనే విష‌యాన్ని నేను న‌మ్ముతాను. ఇందులో మోనిక అనే అమ్మాయి త‌న శ‌రీరాన్ని వాడుకుంది. ఈ విష‌యం గురించి మాట్లాడుతున్న‌ప్పుడు ఓ జ‌ర్న‌లిస్ట్ `ఓ వ్యాంపా?` అన్నారు. ఆ స‌మ‌యంలో అత‌న్ని నేను స‌రిదిద్ద‌డం కూడా ఇంకా గుర్తుంది`` అని అన్నారు. హ్యూమా న‌టించిన త‌ర్లా ఇటీవ‌ల విడుద‌లైంది. పీయుష్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.