English | Telugu

వెయ్యి ప‌డ‌క‌ల హాస్పిట‌ల్ నిర్మిస్తా.. మీ స‌పోర్ట్ కావాలి!

సెకండ్ వేవ్‌లో కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో దేశం నానా తిప్పులు ప‌డుతోంది. క‌రోనా కేసులు ఊహాతీతంగా పెరిగిపోతుండ‌గా, హాస్పిట‌ల్స్‌లో బెడ్లు లేక రోగులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క క‌రోనా పేషెంట్లు మృత్యువాత ప‌డుతున్న వార్తలు నిత్యం చూస్తున్నాం. ఈ నేప‌థ్యంలో క‌రోనా పేషెంట్ల‌కు త‌న వంతు సాయం అందించాల‌ని న‌టుడు గుర్మీత్ చౌధ‌రి నిర్ణ‌యించుకున్నాడు. అత్యాధునిక వెయ్యి బెడ్ల హాస్పిట‌ల్‌ను పాట్నా, ల‌క్నోల‌లో ప్రారంభిస్తాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

"కామ‌న్ మ్యాన్ కోసం పాట్నా, ల‌క్నోల‌లో అత్యాధునిక వెయ్యి బెడ్ల హాస్పిట‌ల్‌ను ప్రారంభించాల‌ని నేను డిసైడ్ చేసుకున్నాను. ఆ త‌ర్వాత మిగ‌తా న‌గ‌రాల్లోనూ ప్రారంభిస్తాను. మీ ఆశీర్వాదాలు, స‌పోర్ట్ కావాలి. జై హింద్‌. త్వ‌ర‌లో వివ‌రాల‌ను షేర్ చేస్తాను." అని ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చాడు. అత‌ని పోస్ట్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ప‌లువురు అత‌ని నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించ‌డ‌మే కాకుండా, తాము స‌పోర్ట్‌గా ఉంటామ‌ని తెలిపారు.

2020 సెప్టెంబ‌ర్‌లో గుర్మీత్‌తో పాటు ఆయ‌న భార్య డెబీనా బెన‌ర్జీ కొవిడ్‌-19 బారిన‌ప‌డ్డారు. ఇటీవ‌ల‌ ప్లాస్మా దానం కూడా చేశారు. గ‌త ఏడాది లాక్‌డౌన్ కాలం నుంచీ ప్ర‌జ‌ల కోసం న‌టుడు సోను సూద్ చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాలు చూసి స్ఫూర్తి పొందాన‌ని ఇటీవ‌ల గుర్మీత్ తెలిపాడు. క‌రోనా సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు సాయం అందించాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పాడు. డెబీనా సైతం కొవిడ్‌-19 నుంచి రిక‌వ‌ర్ అయిన‌వాళ్లంతా రోగుల చికిత్స కోసం తమ ప్లాస్మాను దానం చేయాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపునిచ్చింది.